చైనా మంజా వద్దు సంక్రాంతి సంబరాల్లో ప్రాణాలతో ఆటలొద్దు జిల్లా ఎస్పీ: *

భారత్ న్యూస్ డిజిటల్:వనపర్తి:

చైనా మంజా వద్దు సంక్రాంతి సంబరాల్లో ప్రాణాలతో ఆటలొద్దు జిల్లా ఎస్పీ: *
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
సునిత రెడ్డి, ఐపీఎస్.,

 ➤ నైలాన్ దారాలు ప్రాణాంతకం, సాధారణ దారాలతోనే గాలిపటాలు సురక్షితం

  ➤  కరెంట్ స్థంభాలకు దూరంగా, మైదానాల్లోనే గాలిపటాలు ఎగురవేయాలి

   ➤  భవనాలపై నుంచి గాలిపటాలు, భద్రత తప్పనిసరి

వనపర్తి జనవరి-08: వనపర్తి జిల్లా పరిధిలో చైనా మంజాను పూర్తిగా నిషేధించినట్లు జిల్లా ఎస్పీ శ్రీ మతి సునిత రెడ్డి, ఐపీఎస్., గారు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్బంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉల్లంఘిస్తూ చైనా మంజాను విక్రయించినా, వినియోగించినా లేదా దాని వల్ల ఎవరికైనా ప్రమాదం సంభవించినట్లయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు.

రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని, జిల్లా వ్యాప్తంగా స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నైలాన్, సింథటిక్ దారాలతో తయారయ్యే చైనా మంజా పర్యావరణానికి తీవ్ర హాని కలిగించడంతో పాటు, ప్రజలు, వాహనదారులు, పక్షులకు ప్రాణాపాయం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గతంలో చైనా మంజాతో గాలిపటాలు ఎగురవేసే సమయంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని, కొన్నిసార్లు గాలిపటాలు ఎగురవేసే వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడిన ఘటనలు నమోదయ్యాయని తెలిపారు. ఈ కారణాల దృష్ట్యానే చైనా మంజాపై సంపూర్ణ నిషేధం విధించబడిందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
చైనా మంజా విక్రయాలు, వినియోగంపై పర్యావరణ పరిరక్షణ చట్టం–1986 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలో ఎక్కడా చైనా మంజా విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రజలు చైనా మంజాను ఉపయోగించకుండా, ఎవరికీ హాని కలగని సాధారణ దారాలతో గాలిపటాలు ఎగురవేయాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. గాలిపటాలు ఎగురవేసే వారు తప్పనిసరిగా కరెంట్ స్థంభాలకు దూరంగా, మైదానాలు వంటి సురక్షితమైన ప్రదేశాల్లోనే గాలిపటాలు ఎగురవేయాలని సూచించారు. అలాగే బిల్డింగులపై నుంచి గాలిపటాలు ఎగురవేసే వారు తగిన భద్రతా చర్యలు పాటించి అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.
ఎవరైనా చైనా మంజా విక్రయాలు లేదా వినియోగం గమనించినట్లయితే వెంటనే డయల్–100కు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ గారు ప్రజలను కోరారు.