భారత్ న్యూస్ నెల్లూరు….తొక్కిసలాట మృతుల కుటుంబాలకు విజయ్ వీడియో కాల్
త్వరలో వారిని ప్రత్యక్షంగా కలుస్తానని హామీ
బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తానని చెప్పిన టీవీకే చీఫ్
గాయపడిన వారిని పరామర్శిస్తానని వెల్లడి
తమిళనాడులోని కరూర్ లో టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. గత నెల 27న జరిగిన ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా మరో 60 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన విజయ్.. దుర్ఘటన వెనక కుట్ర కోణం ఉందని ఆరోపించారు. స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని టీవీకే తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను విజయ్ పరామర్శించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ తాజాగా స్పందించారు.
మృతుల కుటుంబాలతో ఆయన వీడియో కాల్ లో మాట్లాడారు. ఈరోజు ఉదయం బాధిత కుటుంబాలకు విజయ్ ఫోన్ చేశారు. ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చారు. త్వరలోనే వచ్చి వారిని కలుస్తానని హామీ ఇచ్చారు. పార్టీ తరఫున, వ్యక్తిగతంగా కూడా వారికి అండగా ఉంటానని విజయ్ పేర్కొన్నారు. తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని త్వరలోనే పరామర్శిస్తానని విజయ్ చెప్పారు. కాగా, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ టీవీకే పార్టీ తరఫున విజయ్ రూ.20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.
