ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ రివ్యూ: ఫార్ములా న‌క్ష‌త్రం.. ఫ్యాన్స్ కి న‌చ్చే గోత్రం

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ రివ్యూ: ఫార్ములా న‌క్ష‌త్రం.. ఫ్యాన్స్ కి న‌చ్చే గోత్రం

రేటింగ్: 2.5/5

గ‌బ్బ‌ర్ సింగ్’ సూప‌ర్ డూప‌ర్ హిట్ సినిమా. అలాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఇచ్చిన త‌ర‌వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ – హ‌రీష్ శంక‌ర్ క‌లిసి ప‌ని చేయ‌డానికి దాదాపు 14 ఏళ్లు ప‌ట్టింది. 14 ఏళ్ల‌లో సినిమా ఎంతో మారింది. ప‌వ‌న్ ఇమేజ్ మారింది. జ‌న‌రేష‌న్ మారింది. ప్రేక్ష‌కుల అభిప్రాయాలు మారాయి. మ‌రి దానికి త‌గ్గ‌ట్టు.. హ‌రీష్ మారాడా లేదా? ప‌వ‌న్ తో మ‌ళ్లీ ప‌ని చేసే ఛాన్స్ వ‌స్తే, దాన్ని ఎంత వ‌ర‌కూ స‌ద్వినియోగం చేసుకొన్నాడు? ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌’ లో ప‌వ‌న్ ని ఎలా చూపించాడు?

క‌థ‌గా చెప్పాల్సి వ‌స్తే, ఇదో సింపుల్ లైన్‌. గ‌బ్బ‌ర్ సింగ్ లానే ఓ పోలీస్ ఆఫీస‌ర్ చేసే పోరాటం. సీఎం కుర్చీ కోసం కుతంత్రాలు ప‌న్నుతున్న విల‌న్ ఆట క‌ట్టించడానికి హీరో చేసే ప్ర‌య‌త్నం. అందులో.. ప‌వన్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ కి న‌చ్చేలా పోరాటాలు, పాట‌లు, హీరోయిజాలు, మేన‌రిజాలు జోడించాడు ద‌ర్శ‌కుడు. సేమ్ టూ సేమ్.. గ‌బ్బ‌ర్ సింగ్ ఫార్ములానే. కాక‌పోతే.. గ‌బ్బ‌ర్ సింగ్ లో క‌థ‌గా చెప్పుకోవ‌డానికి కాస్తో కూస్తో మేట‌ర్ దొరుకుతుంది. ఇక్క‌డ అదే లేదు.

హీరో చైల్డ్ వుడ్ ఎపిసోడ్ నుంచి క‌థ మొద‌ల‌వుతుంది. అస‌లు హీరో ఎవ‌రు, త‌న‌కూ ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రికీ ఉన్న సంబంధం ఏమిటి? అనే పాయింట్ తో క‌థ మొద‌లెట్టి సినిమాలోకి లాక్కెళ్లాడు. ‘ప‌సివాడు ప‌వ‌న్ క‌ల్యాణ్ అయ్యాడు’ అనే ప‌వర్ ఫుల్ ట్యాగ్ లైన్‌తో గ‌బ్బ‌ర్ సింగ్ లో హీరో ని ప‌రిచయ‌డం చేశాడు హ‌రీష్‌. సీన్ లోని యాక్ష‌న్ కంటే.. ఆ ట్యాగ్ లైన్ కే ఫిదా అయిపోయారు ఫ్యాన్స్‌. ఇక్క‌డ కూడా అలాంటి మ్యాజిక్ ఏదో ట్రై చేశాడు కానీ కుద‌ర్లేదు. అంత కిక్ రాలేదు. సీఎంపై హ‌త్యాయ‌త్నం జ‌ర‌గ‌డం, విల‌న్ వేసే రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌తో క‌థలో సీరియ‌స్ నెస్ వ‌స్తుంది. పోలీస్ స్టేష‌న్ ఫైట్ (భ‌గ‌వ‌ద్గీత డైలాగ్ ఇక్క‌డే) తో హీరోని చాలా రెగ్యుల‌ర్ గా ఇంట్ర‌డ్యూస్ చేశారు. రాశీఖ‌న్నా ట్రాక్‌.. ఫ‌న్ కోసం వాడుకొన్నారు. ఆ పాత్ర‌కు క‌థ‌తో బ‌లమైన లింక్ లేదు. అయితే మ‌ధ్య‌మ‌ధ్య‌లో కొన్ని ఐటెమ్స్ జోడించాడు హ‌రీష్‌. ముఖ్యంగా ఉస్తాద్ తో డాన్సులు వేయించ‌డానికి సైడ్ క్యారెక్ట‌ర్స్ ట్రై చేయ‌డం, కొన్ని హిట్ సాంగ్స్ కి ప‌వ‌న్ కాళ్లు క‌ద‌ప‌డం, త‌న‌పై తానే సెటైర్లు వేసుకోవ‌డం టైమ్ పాస్ మూమెంట్స్. ‘ఎత్త‌రా. ఎత్త‌రా’ పాట ప‌వ‌న్ ఫ్యాన్స్ కు హుషారు పంచుతుంది. అస‌లు ఉస్తాద్ ఎవ‌రు అనే చెబుతూ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఓపెన్ చేయ‌డం, అక్క‌డో ట్విస్ట్ రావ‌డం.. ఇంట్ర‌వెల్ లో విల‌న్ (పార్దిబ‌న్‌)కు హీరో వార్నింగ్ ఇవ్వ‌డం ఇవ‌న్నీ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మీట‌ర్‌లో సాగిపోతాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇమేజ్ కీ, ప్ర‌స్తుతం త‌న పొలిటిక‌ల్ మైలేజీకి స‌రిప‌డా డైలాగులు రాసుకొన్నాడు హ‌రీష్‌. అవ‌న్నీ ఫ్యాన్స్ కి న‌చ్చుతాయి.

సెకండాఫ్‌లో శ్రీ‌లీల‌తో ల‌వ్ ట్రాక్ మొద‌ల‌వుతుంది. ‘తొలి ప్రేమ‌’లోని పాట‌ని రీమిక్స్ చేసి పూర్తిగా వాడేశారు. ఆ పాట‌లోని విజువ‌ల్స్ క‌ల‌ర్‌ఫుల్ గా ఉంటాయి. ‘నీ మ‌న‌సే..’తో ప‌వ‌న్ ఫ్యాన్స్ కు కొన్ని మ‌ధుర జ్ఞాప‌కాలు ఉన్నాయి. వాటిని హ‌రీష్ మ‌రోసారి గుర్తు చేశాడు. సెకండాఫ్‌లో ఫ్యాన్స్ ని ఖుషీ చేసే ఎలిమెంట్ ఇదే. అక్క‌డ‌క్క‌డ పాత పాట‌లు గుర్తు చేశాడు. ‘త‌ర‌లిరాద త‌నే వ‌సంతం’ పాట‌ని మంచి ప్లేస్ మెంట్ లో వాడాడు. ఓర‌కంగా సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి లాంటి మ‌హా ర‌చ‌యిత‌కు ఇది నివాళిలాంటి సంద‌ర్భం అనిపించింది. రేప్ సీన్ ఎపిసోడ్‌, అక్క‌డ హీరో ప్ర‌తీకారం తీర్చుకోవ‌డం అవ‌న్నీ రెగ్యుల‌ర్ పేట్ర‌న్‌లో సాగే స‌న్నివేశాలే. పాకిస్థాన్ టెర్ర‌రిజంపై హీరో డైలాగులు చెప్ప‌డం కూడా అంతే రెగ్యుల‌ర్ గా అనిపిస్తాయి. క్లైమాక్స్ లో విల‌న్ ని చంప‌కుండా కొత్త‌ర‌క‌మైన ఎత్తుగ‌డ వేశా.. అని హ‌రీష్ చాలా సంద‌ర్భాల్లో చెప్పాడు. అలా చెప్ప‌డం వ‌ల్ల క్లైమాక్స్ పై అంచ‌నాలు పెరిగాయి. తీరా చూస్తే… అది కూడా రొటీన్ గా అనిపిస్తుంది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమాని హరీష్‌. ఆయన్ని ఎలా చూపిస్తే అభిమానుల‌కు న‌చ్చుతుందో హ‌రీష్‌కు బాగా తెలుసు. ప‌వ‌న్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. కాస్ట్యూమ్స్ కూడా కుదిరాయి. రెండు గంట‌ల పాటు ప‌వ‌న్ ని ఫ్యాన్స్ త‌నివి తీరా చూసుకోవొచ్చు. ఆయ‌న కొన్ని స్టెప్పులు కూడా వేశారు. అది అద‌నం. రాశీఖ‌న్నా పాత్ర‌ని స‌రిగా రాసుకోలేదు. శ్రీ‌లీల ఓకే అనిపిస్తుంది. పార్దీబ‌న్ మెప్పిస్తాడు. రావు ర‌మేష్ ప‌రిధి త‌క్కువే. కె.ఎస్‌.ర‌వికుమార్‌, గౌత‌మి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు.