చిరు ప్ర‌స్దానానికి 47 ఏళ్లు…

భారత్ న్యూస్ మంగళగిరి..చిరు ప్ర‌స్దానానికి 47 ఏళ్లు…

Ammiraju Udaya Shankar.sharma News Editor…కొణిదెల శివ శంక‌ర వ‌ర ప్ర‌సాద్.. చిరంజీవిగా మారి నేటికి 47 ఏళ్లు. స‌రిగ్గా 47 ఏళ్ల క్రితం.. ఇదే రోజు ‘ప్రాణం ఖ‌రీదు’ సినిమా విడుద‌లైంది. చిరంజీవిని వెండి తెర‌కు ప‌రిచ‌యం చేసిన చిత్ర‌మ‌ది. ఆ త‌ర‌వాత చిరంజీవి అంచ‌లంచెలుగా ఎదిగి… సుప్రీం హీరోగా, మెగాస్టార్ గా ఎదిగిన వైనం అంద‌రికీ చిర‌ప‌రిచిత‌మే. ఒక్కో అడుగూ వేసుకొంటూ.. ఒక్కో మెట్టూ ఎక్కుతూ.. ఒక్కో ఇటుకా పేర్చుకొంటూ… ఇప్పుడు ఏకంగా ఓ సామ్రాజ్యాన్ని స్థాపించారు మెగాస్టార్‌. ఇండ‌స్ట్రీ రికార్డులు ఎలా కొట్టాలో, వాటిని ఎలా తిరిగ‌రాయాలో చిరంజీవికి తెలిసినంత‌గా ఇంకెవ్వ‌రికీ తెలీదేమో..? న‌ట‌న‌లో, స్టైల్ లో, డాన్స్ లో, ఎంట‌ర్టైన్‌మెంట్ పంచ‌డంలో.. చిరు ఓ ప్ర‌త్యేక‌మైన దారి ఏర్పాటు చేసుకొన్నారు. ఆ దారే… చాలామంది హీరోలకు ర‌హ‌దారిగా మారి.. స్ఫూర్తిని పంచింది. మాస్ హీరో ఎలా ఉండాలో, ఎలా ఉంటాడో వెండి తెర‌కు చూపించిన స్టార్ చిరంజీవి. నేల‌, బెంచి, బాల్క‌నీ.. ఈ కేట‌గిరీల‌న్నీ ఏకం చేసి.. అంద‌ర్నీ అభిమానులుగా మార్చుకొన్న స్టార్ చిరంజీవి. అందుకే 47 ఏళ్ల ఈ ప్ర‌స్థానం ఇంకా దిగ్విజ‌యంగా సాగుతూనే ఉంది. ఈ ప్ర‌యాణంలో 155 చిత్రాల్ని పూర్తి చేసుకొన్నారు. రాబోయే మూడేళ్ల‌లో క‌నీసం మ‌రో 5 సినిమాలైనా చేయ‌గ‌ల‌రు. మెగాస్టార్‌ 50 ఏళ్ల పండ‌గ‌ను.. ఇండ‌స్ట్రీ అంతా ఘ‌నంగా జ‌రుపుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఆ త‌రుణం కోసం మెగాఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

త‌న న‌ట‌నా ప్ర‌స్థానంలో 47 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా త‌న అభిమానుల‌కు, ప్రేక్ష‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు చిరంజీవి. ప్రేక్ష‌కుల ఆశీస్సుల వ‌ల్లే… ఈ ప్ర‌యాణం సాధ్య‌మైంద‌ని, త‌న‌కొచ్చిన అవార్డులు, రివార్డులూ, పేరు ప్ర‌ఖ్యాతులూ.. ఇవ‌న్నీ అభిమానుల ఆశీర్వాద‌బ‌లం వ‌ల్లే అని, ఇక ముందు కూడా ఈ అభిమానం, ప్రేమ ఇలానే కొన‌సాగాల‌ని ట్వీట్ చేశారు చిరంజీవి.