భారత్ న్యూస్ మంగళగిరి…సుజిత్ నమ్మకం ఖరీదు వందల కోట్లు

Ammiraju Udaya Shankar.sharma News Editor…దశాబ్దంపైగానే అనుభవమున్నా ఇప్పటిదాకా కేవలం మూడు సినిమాలతో క్రేజ్ సంపాదించడం ఒక్క దర్శకుడు సుజిత్ కు మాత్రమే దక్కిన అదృష్టం. రన్ రాజా రన్ ఎంత సూపర్ హిట్ అయినా అదేమీ ప్యాన్ ఇండియా స్థాయిలో రీచ్ కాలేదు. అయినా సరే యువి క్రియేషన్స్, ప్రభాస్ జంటగా తనను నమ్మి సాహో అవకాశాన్ని ఇచ్చాయి. టెక్నికల్ గా ఋజువు చేసుకున్నా కమర్షియల్ గా దాని ఫలితం నిరాశ పరిచిన మాట వాస్తవం. ఆ తర్వాత ఏళ్ళ తరబడి ఎదురు చూపులకు దక్కిన వరంగా పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ దొరికింది. చిరంజీవి గాడ్ ఫాదర్ ఆఫర్ వచ్చినా సుజిత్ వద్దనుకోవడానికి కారణం అది రీమేక్ కావడమే.
ఇప్పుడు సుజిత్ జీవితంలోనే అతి ముఖ్యమైన దశ వచ్చింది. తన ట్రాక్ రికార్డుతో సంబంధం లేకుండా ఓజి మీద విపరీతమైన హైప్ వచ్చింది. దీనికి కారణం కేవలం పవన్ కళ్యాణ్ అని చెప్పలేం. ఎందుకంటే ఇంత హైప్ హరిహర వీరమల్లు, బ్రో, భీమ్లా నాయక్, వకీల్ సాబ్ కు రాలేదు. కానీ ఓజికి మాత్రమే ఎందుకు కనిపిస్తోందంటే సుజిత్ ఓజి అనే పేరుని బ్రాండ్ గా మార్చి దాని మీద సృష్టించిన నమ్మకం. గతంలో పవన్ పంజాలో గ్యాంగ్ స్టర్ గా నటించినప్పటికీ అంతకు మించిన ఇంటెన్స్ డ్రామా ఓజిలో చూపించబోతున్నాననే హామీ అనౌన్స్ మెంట్ పోస్టర్ నుంచి ఇస్తూనే వచ్చాడు. ఇక టీజర్ ఒక మినీ సునామిలాగా దూసుకుపోయింది.
ఇక చివరి ఘట్టంలో అడుగుపెట్టబోతున్న సమయంలో అంచనాలు ఆకాశాన్ని దాటుతున్నాయి. సుజిత్ కు రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ లాగా వందల కోట్ల లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు లేవు. కేవలం ఒక హిట్టు ఒక ఫ్లాపు ఉన్నాయి. అయినా సరే సంవత్సరాల తరబడి ఓజి మీద విపరీతంగా కష్టపడిన సుజిత్ కు దీని సక్సెస్ చాలా కీలకం. టార్గెట్ కొట్టాడా పవన్ అభిమానులు కొన్నేళ్లపాటు గుండెల్లో పెట్టుకుంటారు. ఆడియన్స్ వందల కోట్ల కలెక్షన్లను ధారాళంగా కురిపిస్తారు. అది ఎంతవరకు నిజమవుతోందో తెలియాలంటే రేపు అర్ధరాత్రి దాకా వేచి చూస్తే చాలు. రివ్యూలు, రిపోర్టులు, టాకులు అన్నీ వచ్చేస్తాయి.
