భారత్ న్యూస్ విశాఖపట్నం..దుబాయ్‌లో చిక్కుక్కున్న తెలుగు ప్రముఖులు..
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న తీవ్ర యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా సామాన్యులను మాత్రమే కాక, అంతర్జాతీయ క్రీడాకారులు, సినీ ప్రముఖులను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, నటుడు మంచు విష్ణు పలువురు తెలుగు ప్రముఖులు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. సామాజిక మాధ్యమం ట్విట్టర్ (ఎక్స్) ద్వారా పీవీ సింధు, మంచు విష్ణు తమ అనుభవాలను వెల్లడించారు. ప్రాణాపాయ పరిస్థితి నుంచి సురక్షితంగా బయటపడ్డామని పీవీ సింధు.. ట్వీట్ ద్వారా తెలియజేసింది.
ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌కు వెళ్తుండగా అంతరాయం..
పీవీ సింధు మార్చి3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు బర్మింగ్‌హామ్ వెళ్తున్నారు. దుబాయ్ మీదుగా ప్రయాణించాల్సి ఉండటంతో ఆమె అక్కడ ఆగారు. గగనతలం మూసివేత, భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్ విమానాశ్రయం తన కార్యకలాపాలను నిలిపివేసింది. దీంతో సింధు తన టీమ్ కోచ్ కోచ్ ఇర్వాన్సియా ఆది ప్రతామాతో కలిసి అక్కడే చిక్కుకుపోయారు.
కళ్లెదుటే భారీ పేలుడు.. భయంకరమైన క్షణాలు..
సింధు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వివరాల ప్రకారం.. విమానాశ్రయంలో ఉన్న సమయంలో ఆమెకు అత్యంత సమీపంలో ఒక భారీ పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన ప్రదేశానికి సింధు కోచ్ (కోచ్ ఇర్వాన్సియా ఆది ప్రతామా) చాలా దగ్గరగా ఉన్నారని వివరించారు. పొగ, శిధిలాల మధ్య నుంచి ఆయన ప్రాణాలతో బయటపడాల్సి వచ్చిందని తెలిపారు.
క్షిపణుల శబ్దాలు..
ఆకాశంలో క్షిపణులను అడ్డుకుంటున్న శబ్దాలు వినపడుతున్నాయని, పరిస్థితి నిమిష నిమిషానికీ భయంకరంగా మారుతోందని సింధు ఆందోళన వ్యక్తం చేశారు. దుబాయ్ అధికారులు, భారత ప్రభుత్వం సకాలంలో స్పందించి సింధు బృందాన్ని సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఈ ఆపద సమయంలో తమకు అండగా నిలిచిన దుబాయ్ ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి, అలాగే నిరంతరం పర్యవేక్షిస్తున్న దుబాయ్‌లోని భారత హైకమిషన్‌కు సింధు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితి..
ప్రస్తుతం తాము విశ్రాంతి తీసుకుంటున్నామని, యుద్ధ మేఘాలు తొలగి పరిస్థితులు చక్కబడాలని కోరుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. సింధు మాత్రమే కాకుండా వేలాది మంది ప్రయాణికులు, వారి కుటుంబాలు ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోయారు.
భారీ శబ్దాలు భయాందోళనకు గురిచేశాయి: మంచు విష్ణు

ప్రముఖ నటుడు మంచు విష్ణు తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌లో ఉన్న సమయంలో ఆకాశంలో క్షిపణులు దూసుకెళ్లడం, వాటిని గాలిలోనే అడ్డుకుంటున్న భారీ శబ్దాలు వారిని భయాందోళనకు గురిచేశాయి. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఆయన ట్వీట్ పెట్టారు. దుబాయ్ గగనతలంలో క్షిపణులు కనిపిస్తున్న వీడియోను షేర్ చేస్తూ విష్ణు తన అనుభవాలను గురించి తెలిపారు..