ప్రపంచంలోని ఫార్చూన్ 500 కంపెనీలు తెలంగాణలోని భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి కార్యకలాపాలను నిర్వహించుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ప్రపంచంలోని ఫార్చూన్ 500 కంపెనీలు తెలంగాణలోని భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి కార్యకలాపాలను నిర్వహించుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు.

ఫార్చూన్ 500 కంపెనీల్లో ప్రస్తుతం 85 కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను స్థాపించాయని, భవిష్యత్తులో మిగతా కంపెనీలన్నీ ఇక్కడ తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకునేలా భారత్ ఫ్యూచర్ సిటీని అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ FCDA భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు.

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రాథికార సంస్థ భవనంతో పాటు కొంగరకలాన్ నుంచి ఆమనగల్ వరకు ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ -1 నిర్మాణానికి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు భూమి పూజ చేశారు. ఫ్యూచర్ సిటీ నమూనా చిత్రాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ.. “సింగరేణి సంస్థ కార్పొరేట్ గ్లోబల్ కార్యాలయం కోసం ఫ్యూచర్ సిటీలో 10 ఎకరాలు కేటాయిస్తున్నాం. 2026 డిసెంబర్ నాటికి సింగరేణి కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలి.

ఈరోజు శంకుస్థాపన చేసిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనం డిసెంబర్ నాటికి పూర్తి కావాలి. దీని సమీపంలోనే నిర్మిస్తున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కూడా డిసెంబర్ లో ప్రారంభించుకుంటాం. అప్పుడు నెలకు మూడుసార్లు తాను ఇక్కడికి వస్తా. భవిష్యత్తు కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచే తీసుకుందాం.

గతంలో కులీకుతుబ్ షాహీలు, నిజాం నవాబులు, గత పాలకులు ప్రణాళికా బద్ధంగా నగర అభివృద్ధికి పునాదులు వేసినట్టుగానే భవిష్యత్ తరాల కోసం ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపట్టాం. భారత దేశమే కాకుండా ప్రపంచం గర్వించే ఒక గొప్ప సిటీని నిర్మిస్తాం.

గడిచిన 70 ఏళ్లుగా న్యూయార్క్, సింగపూర్, టోక్యో, దుబాయ్ నగరాలను చూసొచ్చామని.. అలా ఇంకెంత కాలం చెప్పుకుంటాం. న్యూయార్క్ లో ఉన్న వారు సైతం ఫ్యూచర్ సిటీ చూసొచ్చామని చెప్పుకునే తీరుగా దీన్ని తీర్చిదిద్దుతాం.

ఎగుమతి, దిగుమతి వ్యాపార కార్యకలాపాల కోసం పోర్టుతో అనుసంధానం చేయడానికి ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు 12 వరుసల్లో గ్రీన్ ఫీల్డ్ హైవే రాబోతోంది. అలాగే ఇక్కడి నుంచి వయా అమరావతి – చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ నిర్మాణానికి కేంద్రం అంగీకరించింది.

ఇక్కడి నుంచి శ్రీశైలం వరకు వంద మీటర్ల వెడల్పుతో రోడ్డు వేసుకుంటున్నాం. దాంతో పాటు బెంగుళూరుకు బుల్లెట్ ట్రైన్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాం.

ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక క్రమంలో భూములు కోల్పోతున్న కొంతమందికి నష్టం, కష్టం వచ్చి ఉండొచ్చు. ప్రభుత్వం అర్థం చేసుకుని ఆదుకుంటుంది. తగిన పరిహారం ఇవ్వడమే కాకుండా ఫ్యూచర్ సిటీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. చిన్నచిన్న సమస్యలు పరిష్కరించుకుందాం.

నేనెవరికీ అన్యాయం చేయను. న్యాయంగా పరిష్కరించుకుని ముందుకు వెళదాం. ఇండ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పాం. ఇందిరమ్మ ఇండ్లు, ఏటీసీ, ఆసుపత్రి ఇవ్వాలని ఇప్పటికే సూచన చేశా. ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుంది” అని వివరించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.