మరో ఇద్దరు వైసీపీ నేతలు అరెస్ట్.

భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…మరో ఇద్దరు వైసీపీ నేతలు అరెస్ట్

వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు పలువురు అరెస్టయ్యారు. తాజాగా మరో ఇద్దరు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేయడం గమనార్హం.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పలు స్కామ్‌లు, వివిధ కేసుల్లో ఇరుక్కున్న పలువురు వైసీపీ నేతలు వరుసగా అరెస్ట్ అవుతున్నారు. తాజాగా అన్నమయ్య జిల్లాలో ఒకరు.. నెల్లూరు జిల్లాలో మరొకరు ఇవాళ(సోమవారం) అరెస్టయ్యారు. ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అధికార ప్రతినిధి రమేశ్ రెడ్డిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతణ్ని లక్కిరెడ్డిపల్లి నుంచి మదనపల్లె పోలీస్ స్టేషన్‌కు భారీ బందోబస్తు మధ్య తరలించారు. అయితే రమేశ్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే రమేశ్ రెడ్డిని ఫోన్‌లో పరామర్శించారు.

మరోవైపు నెల్లూరు జిల్లాలో వైసీపీ కీలక నేత బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీగా క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, పెద్దఎత్తున పేలుడు పదార్ధాల వినియోగం, అట్రాసిటీ కేసులో ఏ 12 నిందితుడిగా శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. గత కొంత కాలంగా నెల్లూరు జిల్లా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతణ్ని ఏపీకి తరలించారు. ఇక ఇదే కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, నెల్లూరు వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్‌కు ఈ శ్రీకాంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది. తెలంగాణలో శ్రీకాంత్ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా, తప్పు చేసిన ఏ ఒక్కరినీ కూటమి ప్రభుత్వం వదిలిపెట్టకపోవడంతో గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలకు గుబులు పట్టుకుంది.