వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ. పలు అంశాలపై దిశా నిర్దేశం.

భారత్ న్యూస్ విశాఖపట్నం..తాడేపల్లి.

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ. పలు అంశాలపై దిశా నిర్దేశం.

చంద్రబాబు ప్రభుత్వం అన్నింటా విఫలం
విద్య, వైద్యం, వ్యవసాయం సహా అన్ని రంగాల్లో తిరోగమనం
ప్రజలకు కనీసంగా చేయాల్సినవి చేయడం లేదు
ప్రభుత్వం అన్నది ఉందా? లేదా? అన్న సందేహం ప్రజలకు కలుగుతోంది
లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితి మరింత దారుణం
ప్రభుత్వాన్ని నిలదీయడానికి సరిపడా అస్త్రాలు
కానీ ప్రజల గొంతు వినాలన్న ఆలోచన అధికార పక్షానికి లేదు
వైయస్సార్‌సీపీని ప్రధాన ప్రతిక్షంగా గుర్తించడానికి ముందుకు రావడం లేదు
ఒక ఎమ్మెల్యేకు ఇచ్చే సమయం ఇస్తామంటున్నారు
అలాంటి పరిస్థితుల్లో ప్రజల తరఫున బలంగా గొంతు వినిపించలేం
ప్రజా సమస్యలపై లోతుగా మాట్లాడేందుకు అవకాశం ఉండదు
అందుకే మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నాం. నిలదీస్తున్నాం
:శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

శాసనభలో ఉన్నవి నాలుగు పార్టీలు
అందులో మూడు పార్టీలు అధికారంలో భాగస్వాములు
ప్రతిపక్షంలో ఉన్న ఏకైక పక్షం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ
అయినా ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడానికి ససేమిరా అంటున్నారు
:గుర్తు చేసిన శ్రీ వైయస్‌ జగన్‌

మండలిలో మన పార్టీకి మంచి బలం ఉంది
ప్రజా సమస్యలపై గట్టిగా మాట్లాడండి, పోరాట పటిమ చూపండి
ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గట్టండి
ఈ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు
:అన్ని అంశాలపై ఎమ్మెల్సీలకు శ్రీ వైయస్‌ జగన్‌ నిర్దేశం

వైయస్సార్‌సీపీ పెట్టిన మెడికల్‌ కాలేజీలు ప్రజలకు చెందిన తరతరాల ఆస్తి
తన అత్తగారి సొమ్ము అన్నట్టు చంద్రబాబు అమ్మేస్తున్నాడు
దీన్ని కచ్చితంగా అడ్డుకోవాలి, ప్రజలతో కలిసి పోరాటం చేయాలి
పేదల ప్రజ ఆరోగ్య భద్రతకు తూట్లు పొడిస్తూ సహించేది లేదు
:తేల్చి చెప్పిన శ్రీ వైయస్‌ జగన్‌

తాడేపల్లి:
వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. శాసనసభ, మండలి సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై సభ్యులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వంపై ఇంత తక్కువ వ్యవధిలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైందని తెలిపారు. అసలు రాష్ట్రంలోప్రభుత్వం ఉందా? అన్న సందేహం ప్రజలకు కలుగుతోందన్నారు.
శాసనసభలో తాము మాట్లాడేలా తగిన సమయం కేటాయించడం ఇష్టం లేకనే, వైయస్సార్‌సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం లేదని శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. మొత్తం సభ్యులతో కలిపి, కేవలం ఒక ఎమ్మెల్యేకు మాత్రమే ఇచ్చే అతి తక్కువ సమయంలో ప్రజా సమస్యలు ఎలా ప్రస్తావిస్తామని ఆయన ప్రశ్నించారు. అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్న ఆయన, ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, నిలదీసేందుకు అవసరమైన పూర్తి మెటేరియల్‌ సిద్ధంగా ఉందని, కానీ మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వడం లేదు కాబట్టే.. సభకు హాజరు కావడం లేదని తేల్చి చెప్పారు.
పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో శ్రీ వైయస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..:

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు నిర్వీర్యం:
రాష్ట్రంలో కీలకమైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తం ఏడు త్రైమాసికాలు పెండింగ్‌. ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్లు. గత ఏడాది ఎన్నికల ముందు.. 2024 జనవరి–మార్చి మొదలు ఈ ఏడాది సెప్టెంబరు వరకు చూస్తే.. మొత్తం ఏడు క్వార్టర్లు.. అంటే దాదాపు రూ.4900 కోట్లు బకాయి. అయితే ప్రభుత్వం ఇచ్చింది కేవలం రూ.900 కోట్లు మాత్రమే. అంటే ఇంకా దాదాపు లా రూ.4 వేల కోట్లు బకాయి. వసతి దీవెన గత ఏడాది రెండు దఫాలు. ఈ ఏడాది మరో దఫా పెండింగ్‌. అలా మొత్తం రూ.4200 కోట్లు బకాయి.
వసతి దీవెన కింద మరో రూ.2,200 కోట్లు బకాయి పడ్డారు. అలా ఈ రెండు పథకాలకే రూ.6,200 కోట్లు బకాయి పడ్డారు. కాలేజీలు కూడా చేతులెత్తేసే పరిస్థితులు వచ్చాయి. స్కూళ్లలో నాడు–నేడు పనులన్నీ గాలికి ఎగిరిపోయాయి. గోరుముద్ద నాశనం అయ్యింది. ట్యాబులిచ్చే కార్యక్రమం ఆగిపోయింది. సీబీఎస్‌ఈని రద్దు చేశారు. సబ్జెక్టు టీచర్ల కాన్సెప్ట్‌ గాలికి ఎగిరిపోయింది. స్కూళ్లలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు పని చేయకపోవడం కూడా ఆగిపోయింది. ఇంకా పిల్లలకు ఇచ్చే చిక్కీలు కూడా ఆపేశారు.
ఇక వైద్య రంగం పరిస్థితి చూస్తే మరింత ఘోరంగా ఉంది. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీని ఆపేశారు. ఆరోగ్య శ్రీకి రూ.3500 కోట్లకు పైగా బకాయి పడ్డారు. దీంతో పథకంలో వైద్యం చేయలేమని ఆస్పత్రుల్లో బోర్డులు పెట్టేస్తున్నారు. ఇంకా ఆరోగ్య ఆసరా కింద రూ.600 కోట్ల బకాయి పడ్డారు.

ఇవీ మెడికల్‌ కాలేజీల ప్రయోజనాలు:
మన ప్రభుత్వంలో ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీల పనులు మొదలుపెట్టి, ఏడు కాలేజీలు పూర్తి చేశాం. ఒక మెడికల్‌ కాలేజీ అనేది కేవలం కాలేజీ మాత్రమే కాదు. దాంతో టీచింగ్‌ హాస్పిటల్‌ ఉంటుంది. మంచి వైద్య సేవలందుతాయి. అది ప్రభుత్వ బాధ్యత. ఒకవేళ ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు, బస్సులు నడపకపోతే.. ఆయా రంగాల్లో ప్రై వేటు దోపిడిని అరికట్టగలుగుతారా? అందుకే ఎక్కడైనా, వాటిని ప్రభుత్వం తప్పనిసరిగా నిర్వహిస్తుంది.
మనం ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మెడికల్‌ కాలేజీ పనులు మొదలుపెట్టాం. దాని వల్ల అక్కడ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్య సేవలందుతాయి. ఒక మెడికల్‌ కాలేజీ ఉంటే, సీనియర్‌ వైద్యులు, స్పెషలిస్టులు, నర్సులు అందరూ అందుబాటులోకి వస్తారు. వైద్య సేవలందిస్తారు. అలా ప్రజలకు మంచి వైద్యం అందడమే కాకుండా, మన పిల్లలకు.. ముఖ్యంగా నిరుపేద పిల్లలకు మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి.

వ్యవసాయ రంగం పరిస్థితి దారుణం:
రైతులకు యూరియా కూడా సప్లై చేయని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. మొత్తం బ్లాక్‌ మార్కెట్‌ను నడిపిస్తున్నారు. ఇంకా ఏ పంటకూ గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. ఏ పంటకు ఎంత ధర ఇవ్వాలన్న దానిపై నాడు మనం ప్రతి గ్రామంలోనూ పోస్టర్‌ ఇచ్చే వాళ్లం. సీఎం యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి రైతులకు తోడుగా నిలబడే వాళ్లం. మార్కెట్‌ జోక్యంతో మంచి ధరలకు పంటలు కొన్నాం. అందుకు రూ.7800 కోట్లు ఖర్చు చేశాం. కానీ ఈ ప్రభుత్వంలో ఏమీ లేవు. ఉచిత పంటల బీమాను కూడా రద్దు చేశారు.
అన్నదాతా సుఖీభవ కింద రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారు. వ్యవసాయం చేయడానికి రైతులు భయపడుతున్నారు. ఇలా అన్ని రంగాల్లోనూ పూర్తిగా తిరోగమనమే.

ఎక్కడికక్కడ దోపిడి. నీకింత.. నాకింత:
శాంతి భద్రతల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వ్యవస్థల్లో ఇంత లంచాలు ఎప్పుడూ చూడలేదు. ఎక్కడికక్కడ సిండికేట్లుగా మారి వసూళ్లు చేస్తున్నారు. పెదబాబుకు ఇంత, చిన బాబుకు ఇంత అని పంచుతున్నారు. లిక్కర్‌ను ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు అమ్ముతున్నారు. అక్రమంగా పర్మిట్‌ రూమ్‌లు నడుపుతున్నారు. ఉచిత ఇసుక అన్నారు. అది లేదు. ఇంకా క్వార్ట్‌›్జ, సిలికా.. దేన్నీ వదిలిపెట్టడం లేదు. చివరకు ఫ్లైయాష్‌ కూడా అమ్మేసుకుంటున్నారు.

అన్నింటా విఫలమైనా నిస్సిగ్గుగా సూపర్‌హిట్‌!:
అన్నింటా దారుణంగా విఫలమైనా, ఎన్నికల హామీలు నిలబెట్టుకోకపోయినా, ఇటీవల సూపర్‌సిక్స్‌.. సూపర్‌హిట్‌ పేరుతో కార్యక్రమం చేశారు. ఆ సభ సందర్భంగా ఇచ్చిన అడ్వరై్టజ్‌మెంట్, ఎన్నికల నాటి యాడ్‌తో చూస్తే పూర్తిగా మారిపోయింది.
18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు. 50 ఏళ్లు నిండిన వారందరికీ పెన్షన్‌ రూ.4 వేలు లేవు. పథకాలు కూడా మారిపోయాయి. ఇదీ ఈ ప్రభుత్వ నిర్వాకం.

ప్రజల గొంతు వినడం ప్రభుత్వానికి ఇష్టం లేదు:
అసెంబ్లీలో ప్రజల గొంతు వినిపించాలన్న తపన, ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. నాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు, టీడీపీ నుంచి వారంలోనే 5గురు మనవైపు వచ్చి కూర్చున్నారు. అలా ఇంకొందరిని లాక్కుని, చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా లేకుండా చేద్దామని చాలా మంది సలహా ఇస్తే, నేను వద్దన్నాను. విపక్షం గొంతు వినాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆమేరకు వారికి అవకాశాలు ఇచ్చాం. సభలో వారు చెప్పేది విన్నాం.
కానీ, ఈరోజు ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ.. ప్రతిపక్షం లేకుండా ఉండాలని కోరుతోంది. అందుకే మనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వద్దని అనుకుంటోంది. అందుకే మనల్ని ప్రతిపక్షంగా గుర్తించడం లేదు.