భారత్ న్యూస్ అనంతపురం..భారత్‌లో బయటపడ్డ రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబులు
80 ఏళ్ల నుంచి పేలకుండా ఉన్న బాంబులు
ప్రస్తుతం ప్రపంచమంతా యుద్ధ వాతావరణంలో ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికాల మధ్య ఉన్న పరిస్థితులు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా భారత్‌లో రెండో ప్రపంచ యుద్ధ సమయానికి చెందిన రెంబు బాంబులు బయటపడ్డాయి.ఝార్ఖండ్ రాష్ట్రంలోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలో ఉన్న బహరాగోరా ప్రాంతంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. స్వర్ణరేఖ నది ఒడ్డున ఇసుక తవ్వకాల సమయంలో భారీ ఇనుప వస్తువులు బయటపడ్డాయి. మొదట ఇవి సాధారణ స్క్రాప్ అనుకున్నారు. అయితే దగ్గరగా పరిశీలించగా అవి రెండో ప్రపంచ యుద్ధ కాలానికి చెందిన భారీ బాంబులని గుర్తించారు. ఒక్కో బాంబు సుమారు 227 కిలోల బరువు కలిగి ఉంది. దాదాపు 80 సంవత్సరాలుగా ఇసుకలో పాతుకుపోయి ఉన్నప్పటికీ అవి ఇంకా పేలని స్థితిలోనే ఉండటం అధికారులు ఆందోళనకు గురిచేసింది.ఈ విషయం తెలిసిన వెంటనే అధికారులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. ప్రమాదం తలెత్తకుండా ప్రజలను దూరంగా తరలించారు. అనంతరం భారత సైన్యానికి చెందిన బాంబు నిర్వీర్య దళాన్ని అక్కడికి పిలిచారు. ప్రత్యేక జాగ్రత్తలతో సైనికులు ఆ రెండు బాంబులను పరిశీలించి సురక్షితంగా డిఫ్యూస్ (నిర్వీర్యం) చేశారు. నిపుణుల ప్రకారం ఆ బాంబులు పేలితే చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర నష్టం కలిగేది.బాంబులపై ఉన్న గుర్తులను పరిశీలించిన నిపుణులు వాటిని AN-M64 మోడల్ గా గుర్తించారు. ఇవి అమెరికాలో తయారైన వైమానిక బాంబులు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో యుద్ధ విమానాల ద్వారా లక్ష్య ప్రాంతాలపై విసిరేలా వీటిని తయారు చేశారు. బాంబులపై “Made in USA” అనే గుర్తులు కూడా కనిపించాయి. ఏదో కారణంతో అవి అప్పట్లో పేలకుండా నదిలో పడిపోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.ఈ బాంబులు అక్కడికి ఎలా చేరాయనే ప్రశ్న ప్రస్తుతం అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. అధికారిక పత్రాలు ఇప్పటివరకు లభించకపోయినా ఒక అంచనా మాత్రం ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా, బ్రిటన్ దేశాల విమానాలు భారత్ తూర్పు ప్రాంతాల్లోని ఎయిర్‌బేస్‌లను ఉపయోగించేవి. అక్కడి నుంచి బర్మా (ప్రస్తుత మయన్మార్), చైనా ప్రాంతాలకు వెళ్లేవి. ఆ సమయంలో ఏదైనా విమానం ప్రమాదానికి గురై ఉండవచ్చు లేదా సాంకేతిక లోపంతో బాంబులు పడిపోయి ఉండవచ్చు. కాలక్రమంలో అవి నది ఇసుకలో పాతుకుపోయి ఇప్పుడు బయటపడ్డాయి.1939 నుంచి 1945 వరకు సాగిన రెండో ప్రపంచ యుద్ధం మానవ చరిత్రలో అత్యంత విధ్వంసకరమైన యుద్ధంగా గుర్తింపు పొందింది. ఈ యుద్ధం ప్రధానంగా యూరప్, ఆసియా, ఆఫ్రికా, అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాల్లో జరిగింది. జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు ఒకవైపు ఉండగా బ్రిటన్, అమెరికా, సోవియట్ యూనియన్ వంటి దేశాలు మరోవైపు పోరాడాయి. ఆసియా ప్రాంతంలో ముఖ్యంగా చైనా, ఫిలిప్పీన్స్, జపాన్, బర్మా ప్రాంతాలు యుద్ధ ప్రభావాన్ని తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆ సమయంలో భారత తూర్పు ప్రాంతాలు మిత్రదేశాల సైనిక కార్యకలాపాలకు ముఖ్య కేంద్రాలుగా పనిచేశాయి. అందుకే ఇప్పటికీ ఒడిశా, ఝార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాల అడవుల్లో అప్పటి యుద్ధానికి సంబంధించిన పేలని బాంబులు లేదా విమాన అవశేషాలు అప్పుడప్పుడు బయటపడుతుంటాయి.
