మూడు పంచాయతీలు.. మూడు అద్భుత ప్రాజెక్టులు

భారత్ న్యూస్ గుంటూరు…మూడు పంచాయతీలు.. మూడు అద్భుత ప్రాజెక్టులు

గ్రామ వికాసానికి చిరునామా “ఆది అశోక్”

రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా, గ్రామాల్లో పర్యావరణ విప్లవాన్ని తీసుకువస్తున్నారు పంచాయతీ కార్యదర్శి ఆది అశోక్. గ్రామ వికాసం, పర్యావరణ హిత అభివృద్ధి అనే లక్ష్యాలను క్షేత్రస్థాయిలో అక్షరాలా నిజం చేస్తున్నారు. టి.కొత్తపాలెం పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూనే, నంగేగడ్డ మరియు ఎదురుమొండి గ్రామాలకు ఇన్-ఛార్జ్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించిన అశోక్ గారు, ఆ మూడు చోట్లా అద్భుతాలు సృష్టిస్తున్నారు.

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారి నేతృత్వంలో, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ పెనుముడి సాయిబాబు గారి సహకారంతో అశోక్ గారు చేపట్టిన ప్రాజెక్టులు నేడు జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయి.

టి.కొత్తపాలెంలో “గ్రామ ఆరోగ్య వనం”, నంగేగడ్డలో 20 ఏళ్ల నాటి చెత్త కుప్పను తొలగించి నిర్మించిన “ప్రసన్న వదనం – హరిత గ్రామం – నవ నందనవనం”, మరియు ఎదురుమొండిలో ఈరోజు ప్రారంభమైన “కృష్ణవేణి నమోస్తుతే రివర్ వ్యూ ఎకో పార్క్” ఆయన కార్యదక్షతకు నిలువెత్తు సాక్ష్యాలు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు అశోక్ గారిని ప్రత్యేకంగా ప్రశంసించారు. “ఒక అధికారికి పట్టుదల, సమాజంపై బాధ్యత ఉంటే అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేయవచ్చని అశోక్ గారు నిరూపించారు” అని ఆయన కొనియాడారు. ఇంచార్జ్ బాధ్యతల్లో ఉండి కూడా మూడు గ్రామాలను తన సొంత ఊరిలా భావించి, పచ్చదనంతో తీర్చిదిద్దడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

నిధుల కొరతను సాకులుగా చూపకుండా, అందుబాటులో ఉన్న వనరులతోనే అద్భుతాలు సృష్టించి, ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములను చేయడంలో అశోక్ గారు చూపిన చొరవ అసాధారణం. అభివృద్ధి అంటే కేవలం సిమెంట్ కట్టడాలు మాత్రమే కాదని, పర్యావరణ పరిరక్షణ కూడా అని చాటిన ఆది అశోక్ గారు, నిజమైన “గ్రామ సేవకుడు” అంటే ఎలా ఉండాలో తన ప్రతి అడుగులోనూ ఆచరించి చూపిస్తున్నారు.