ఏపీలో ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం

భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలో ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. స్మార్ట్ మీటర్ల బిగింపుతో ఎక్కువ బిల్లులు వచ్చే అవకాశం ఉందని, వాడినా వాడకపోయినా బిల్లులు పడతాయనే భావన సాధారణ ప్రజల్లో ఉంది.
ఈ నేపథ్యంలో స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ఇళ్లకు వస్తున్న విద్యుత్ శాఖ సిబ్బందిని పలు చోట్ల అడ్డుకుంటున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

విశాఖపట్నంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రజల అంగీకారం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించవద్దని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగించాలని సూచించారు. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించేది లేదని కూడా మరోసారి స్పష్టం చేశారు.

స్మార్ట్ మీటర్లపై సోషల్ మీడియాలో కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని, స్మార్ట్ మీటర్ల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారుల్ని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు.