భారత్ న్యూస్ తిరుపతి…స్లీపర్ బస్సు స్వాధీనం, వారాంతంలో
40 వాహనాలపై కేసు నమోదు.
జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీ కొర్రపాటి మురళీమోహన్ గారి ఆదేశాల మేరకు తిరుపతికి వస్తున్న కాంట్రాక్ట్ క్యారేజ్ వాహనాలపై విస్తృత స్థాయిలో ప్రత్యేక తనిఖీల నిర్వహణ కావిస్తున్నారు. ప్రయాణికుల భద్రతను ప్రధాన లక్ష్యంగా తీసుకొని, రహదారి భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయించే దిశగా ఈ తనిఖీలు చేపట్టబడినవి.
గత వారం రోజులుగా జిల్లాలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రధాన రహదారులు, చెక్‌పోస్టులు మరియు టోల్ గేట్ల వద్ద నిరంతర తనిఖీలు జరుగుతున్నాయి. ఈ తనిఖీల సందర్భంగా జగదల్పూర్ నుండి తిరుపతి వైపు ప్రయాణిస్తున్న ఒక కాంట్రాక్ట్ క్యారేజ్ స్లీపర్ బస్సు AIS-119 నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించబడింది. ముఖ్యంగా వాహన నిర్మాణం, బెర్త్ అమరిక, భద్రతా ప్రమాణాలు మరియు అత్యవసర నిష్క్రమణ మార్గాల విషయంలో గణనీయమైన లోపాలు ఉన్నందున, సంబంధిత వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది.
అదనంగా, ఇతర కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, పలు రకాల ఉల్లంఘనల కింద 40 బస్సులపై కేసులు నమోదు చేశారు .
వీటిలో ముఖ్యంగా అగ్నిమాపక నియంత్రణ పరికరము, అత్యవసర ద్వారాలు, అధిక ప్రయాణికులు, భద్రతా ప్రమాణాల లోపాలు మరియు అవసరమైన పత్రాలు లేకపోవడం వంటి అంశాలు గుర్తించబడినవి. ఈ వాహనాలపై ఆరు లక్షల రూపాయల అపరాధ రుస్తుం విధించడం జరిగింది.
ఈ ప్రత్యేక తనిఖీలలో మోటార్ వాహన తనిఖీ అధికారులు దామోదర్ నాయుడు, శ్రీనివాసరావు, మోహన్ కుమార్, అతికానాజ్, రమణ నాయక్, ఆంజనేయ ప్రసాద్, వర్మ, స్వర్ణలత పాల్గొన్నారు. అధికారులు క్షుణ్ణంగా ప్రతి వాహనాన్ని పరిశీలించి, చట్టపరమైన నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీ కొర్రపాటి మురళీమోహన్ గారు మాట్లాడుతూ, ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా నిబంధనలను ఉల్లంఘించే వాహన యజమానులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా ఈ విధమైన తనిఖీలు మరింత కఠినంగా, నిరంతరంగా కొనసాగుతాయని తెలిపారు.
ప్రజలు మరియు వాహన యజమానులు రవాణా శాఖ నిబంధనలను పాటించి, రహదారి భద్రతకు సహకరించాలని ఆయన కోరారు. ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు.
