ఆరుగురు ప్రొఫెస‌ర్ల‌కు ఏడీఎంఇలుగా ప‌దోన్న‌తి

భారత్ న్యూస్ మంగళగిరి….Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆరుగురు ప్రొఫెస‌ర్ల‌కు ఏడీఎంఇలుగా ప‌దోన్న‌తి

321 మంది సెకండ‌రీ ఆసుప‌త్రుల వైద్యుల‌కు ప్ర‌మోష‌న్లు

గ‌తేడాది కాలంలో 600 మంది ప్ర‌భుత్వ వైద్యుల‌కు ప్ర‌మోష‌న్లు

అమరావతి :

ఏపీలో ఆగ‌ష్టు 31తో ముగిసిన 2024-25 ప్యానల్ సంవ‌త్స‌రంలో ప్ర‌భుత్వ వైద్యుల‌కు వైద్యారోగ్య శాఖ భారీ స్థాయిలో ప‌దోన్న‌తులు క‌ల్పించింది. వివిధ విభాగాల అధీనంలో ప‌నిచేసే దాదాపు 600 మంది వైద్యులు ప్ర‌మోష‌న్లు పొందారు. గ‌త కాలంలో ప‌దోన్న‌తుల విష‌యంలో ఆల‌స్యం జ‌రిగిన‌ట్లు ఫిర్యాదులొచ్చిన నేప‌థ్యంలో నిర్ణీత స‌మ‌యంలో అర్హులైన వైద్యులంద‌రికీ ప్ర‌మోష‌న్లు ఇవ్వాల‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆదేశించ‌డంతో ఈ స్థాయిలో ప‌దోన్న‌తులు జ‌రిగాయ‌ని ఉన్న‌తాధికారులు తెలిపారు.

ప్రిన్సిపాళ్లు/ సూప‌రింటెండెంట్లుగా ప‌దోన్న‌తి

వివిధ విభాగాల‌కు చెందిన ఆరుగురు సీనియ‌ర్‌ ప్రొఫెస‌ర్ల‌ను ఎడిఎంఇలుగా (అడిష‌న‌ల్ డైరెక్ట‌ర్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ ) ప్ర‌మోట్ చేయాల‌ని తాజాగా వ‌చ్చిన క‌మిటీ సిఫార‌సుల‌ను మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆమోదించారు. వీరు ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌ల ప్రిన్సిపాళ్లు, బోధానాసుప‌త్రుల సూప‌రింటెండెంట్లుగా నియ‌మించ‌బ‌డ‌తారు. వీరికి త్వ‌ర‌లో పోస్టింగ్‌లిస్తారు. దీంతో 2024-25 ప్యాన‌ల్ ఇయ‌ర్‌లో మొత్తం 13 మంది సీనియ‌ర్ వైద్యులు ఎడిఎంఇలుగా ప్ర‌మోట‌య్యారు.

సెంక‌డ‌రీ వైద్య సేవ‌లందిస్తున్న 321 మందికి ప్ర‌మోష‌న్లు

ప్ర‌భుత్వ సెంక‌డ‌రీ ఆసుప‌త్రుల్లో వివిధ స్థాయిల్లో సేవ‌లందిస్తున్న 321 మంది వైద్యుల‌కు శ‌ని, ఆది వారాల్లో ప‌దోన్న‌తులు క‌ల్పించిన‌ట్లు సెకండ‌రీ హెల్త్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎ.సిరి తెలిపారు. వీరిలో…34 మంది సివిల్ స‌ర్జ‌న్ స్పెష‌లిస్టులుగాను, 78 మంది డెప్యుటీ సివిల్ స‌ర్జ‌న్ స్పెష‌లిస్టులుగాను, 109 మంది డిప్యుటీ సివిల్ స‌ర్జ‌న్ జ‌న‌ర‌ల్‌గాను ప‌దోన్న‌తి పొందారు. వీరితో పాటు 100 మంది డెంట‌ల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్లు డెప్యుటీ డెంట‌ల్ స‌ర్జ‌న్లుగా ప్ర‌మోట‌య్యారు.

డీఎంఇలో కూడా భారీగా ప‌దోన్న‌తులు

ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లు, బోధానాసుప‌త్రుల్లో ప‌నిచేసే 217 మంది వైద్యుల‌కు 2024-25లో ప్ర‌మోష‌న్లు క‌ల్పించ‌డం జ‌రిగింది. వీరిలో 13 మంది వైద్యులు ఎడిఎంఇలుగాను, 96 మంది ప్రొఫెస‌ర్లుగాను, మ‌రో 108 మంది అసోసియేట్ ప్రొఫెస‌ర్లుగాను ప్ర‌మోట‌య్యారు.

600 మందికి ప‌దోన్న‌తులు

2024-25 ప్యాన‌ల్ సంవ‌త్స‌రంలో ప్రైమ‌రీ, సెకండరీ, టెరిష‌రీ మ‌రియు ఆయుష్‌ వైద్య సేవ‌లు అందిస్తున్న దాదాపు 600 మంది వైద్యుల‌కు ఆయా విభాగాల్లో ప‌దోన్న‌తులు క‌ల్పించిన‌ట్లు ఉన్న‌తాధికారులు తెలిపారు. నీర్ణీత స‌మ‌యంలో వైద్యుల‌కు ప‌దోన్న‌తులు క‌ల్పించ‌డానికి కృషి చేసిన మంత్రిత్వ శాఖ మ‌రియు వివిధ విభాగాల‌కు చెందిన ఉన్న‌తాధికారుల‌ను మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అభినందించారు.