కొమ్మమూరు కాలువలోకి దూసుకెళ్లిన ఇసుక టిప్పర్

భారత్ న్యూస్ గుంటూరు…కొమ్మమూరు కాలువలోకి దూసుకెళ్లిన ఇసుక టిప్పర్

నియంత్రణ కోల్పోయి వంతెనపై నుంచి బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

చేబ్రోలు..

గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామ శివారులో ఘోర ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న ఓ ఇసుక టిప్పర్ నియంత్రణ కోల్పోయి కొమ్మమూరు కాలువ వంతెన పైనుంచి కాలువలోకి బోల్తా పడింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.

స్థానిక సమాచారం ప్రకారం.. ఇసుక లోడుతో వెళ్తున్న టిప్పర్ చేబ్రోలు శివారులోని కొమ్మమూరు కెనాల్ వంతెనపైకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పింది. వంతెన రక్షణ గోడను బలంగా ఢీకొట్టి, నేరుగా కాలువలోకి పడిపోయింది. ప్రమాద ధాటికి వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను గమనించిన అటుగా వెళ్తున్న వాహనదారులు, స్థానికులు వెంటనే స్పందించి బయటకు తీశారు.

అపస్మారక స్థితిలో ఉన్న డ్రైవర్‌ను 108 అంబులెన్స్ ద్వారా మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి (GGH) తరలించారు.

సమాచారం అందుకున్న చేబ్రోలు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాలువలో పడిపోయిన టిప్పర్‌ను వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.