ఎర్రచందనం దుంగలు – బార్ కోడ్

భారత్ న్యూస్ అనంతపురం…ఎర్రచందనం దుంగలు – బార్ కోడ్

Ammiraju Udaya Shankar.sharma News Editor…ప్రతి ఎర్రచందనం దుంగకూ బార్ కోడ్

• జియో ట్యాగింగ్ ద్వారా లైవ్ ట్రాకింగ్
• అనుమతి లేనిదే ఒక్క దుంగ కూడా బయటకు పోకూడదు
• ఎన్ని లక్షల ఎర్రచందనం చెట్లు అక్రమంగా కొట్టేశారో ప్రపంచానికి తెలియాలి

  • మంగళం ఎర్రచందనం డిపో పరిశీలన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

స్మగ్లర్ల చేతిలో అక్రమంగా నరకగా అటవీ శాఖ అధికారులకు పట్టుబడిన ప్రతి ఎర్రచందనం దుంగకు ప్రత్యేక బార్ కోడ్, జియో ట్యాగింగ్ తో లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఎర్రచందనం దుంగలు పట్టుబడిన దగ్గర నుంచి అమ్మకం జరిపే వరకు అనుమతి లేకుండా ఒక్క దుంగ కూడా పక్కదారి పట్టడానికి వీల్లేదని అటవీ శాఖ అధికారులకు ఆదేశించారు. లాట్లు, నంబర్లు ఇచ్చే పాత విధానాల స్థానంలో అధునాతన సాంకేతికతతో విలువైన ఎర్రచందనం దుంగలకు భద్రత కల్పించనున్నట్టు తెలిపారు. శనివారం తిరుపతి జిల్లా, మంగళంలోని ఎర్రచందనం డిపోని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు. డిపోలో మొత్తం 8 గోడౌన్లు ఉండగా, ప్రతి గోడౌన్ ను, ప్రతి దుంగను నిశితంగా పరిశీలించారు.
• దుంగల గ్రేడ్లు, స్టాక్ రిజిస్టర్ల పరిశీలన
ఎర్రచందనం దుంగల గోడౌన్ పరిశీలనకు వెళ్లిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదటి గోడౌన్ లో భారీ సంఖ్యలో ఉన్న దుంగలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం ఇంత పెద్ద ఎత్తున వృక్ష సంపద విధ్వంసం జరుగుతోందా? అని అంటూ అధికారులను ప్రశ్నించారు. అక్కడ సందర్శనకు ఉంచిన దుంగలను గ్రేడ్ల వారీగా పరిశీలించారు. నాణ్యత ఆధారంగా దుంగల గ్రేడ్లు నిర్ణయిస్తారని అధికారులు తెలుపగా, సుత్తితో ఆ దుంగలను కొట్టి శబ్దం ఆధారంగా గ్రేడ్లలో ఉన్న తేడాలను తెలుసుకున్నారు. ఎర్రచందనంతో తయారు చేసిన విగ్రహాలు, బ్రీడ్స్, చిన్న చిన్న వస్తువుల తయారీ కోసం కట్ చేసి అమ్మకానికి ఉంచిన చిన్న చిన్న ముక్కలు, ఔషదాల తయారీలో వినియోగించే ఎర్రచందనం రంపపు పొట్టును పరిశీలించారు. వాటికి ఎక్కడ మార్కెట్ ఉంది? ఎవరు కొంటారు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అదే గోడౌన్లో దుంగల రిజిస్టర్ ని పరిశీలించారు. దుంగల సంఖ్య, వాటి లాట్ నంబర్లతో సహా డిజిటలైజ్ చేశారా? లేదా? అని ఆరా తీశారు.
• ప్రతి గోడౌన్ కలియదిరుగుతూ.. ప్రతి దుంగనీ పరిశీలిస్తూ..
మంగళం ఎర్రచందనం డిపోలో ఉన్న మొత్తం ఎనిమిది గోడౌన్లలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలియదిరిగారు. దుంగలు పుచ్చు పట్టడం, పాడవడం లాంటివి జరుగే అవకాశం ఉందా అని అధికారులను ఆరా తీశారు. ఎన్నాళ్లు ఉన్నా పుచ్చుపట్టకపోవడమే ఎర్రచందనం ప్రత్యేకత అని అధికారులు వివరించారు.
• జరుగుతున్న విధ్వంసం ప్రపంచానికి తెలియాలి
ఎర్రచందనం డిపోలో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన దుంగలను చూసి అక్రమార్జన కోసం అడవుల్లో ఇంత పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతుందా అని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని లక్షల చెట్లను చందన స్మగ్లర్లు నరికి వేయడం కారణంగా డిపోల్లోకి ఇన్ని లక్షల దుంగలు చేరాయని అన్నారు. స్మగ్లర్లు ఎంత సంపద దోచుకోవడానికి ప్రయత్నించారో, ఎన్ని లక్షల చెట్లను నరికేశారో ప్రపంచం మొత్తానికి తెలియాలన్నదే తన తపన అని అన్నారు.
ఎర్రచందనం డిపోలో కలియ దిరుగుతూనే ఆ ప్రాంగణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో పెంచిన మొక్కలను పరిశీలిచారు. టెరోమా జేరా అనే విదేశీ జాతి మొక్కను ఆసక్తిగా తిలకించి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపుగా, ఎత్తుగా ఎదిగే స్వభావం ఉన్న ఈ మొక్క ఆకులు మొత్తం రాలిపోయాక పూలతో కనువిందు చేస్తుందని అధికారులు వివరించారు….