.భారత్ న్యూస్ అమరావతి..అమరావతికి కేంద్రం రక్షణ కవచం !
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వతం చేసే దిశగా ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ప్రధానమంత్రి కార్యాలయం నుండి వచ్చిన స్పష్టమైన సంకేతాలతో, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అమరావతిని ఏకైక రాజధానిగా ఖరారు చేస్తూ మరోసారి తీర్మానం చేయనుంది. ఈ తీర్మానం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014లో సవరణలు చేసి, అమరావతిని అధికారిక రాజధానిగా పొందుపరచనుంది. ఒకసారి విభజన చట్టంలో రాజధాని పేరు చేరితే, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ముఖ్యమంత్రి అనుకున్నా దానిని మార్చడం రాజ్యాంగబద్ధంగా అసాధ్యం అవుతుంది.
అసెంబ్లీకి జగన్ వస్తారా?
ఈ కీలక తీర్మానం సమయంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏం చేస్తారో స్పష్టత లేదు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 33 వేల ఎకరాలు రాజధానికి ఉండాల్సిందే అని అసెంబ్లీ సాక్షిగా మద్దతు తెలిపిన జగన్, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో ఆ నిర్ణయాన్ని తుంగలో తొక్కారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే తీర్మానానికి వైసీపీ మద్దతు ఇస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ మద్దతు ఇస్తే తన పాత యూ-టర్న్ నిర్ణయాన్ని ఒప్పుకున్నట్లు అవుతుంది, ఇవ్వకపోతే అమరావతికి వ్యతిరేకి అనే ముద్ర శాశ్వతంగా పడిపోతుంది. అందుకే ఆయన రాకపోవచ్చు.. ఎమ్మెల్యేల్ని పంపకపోవచ్చు.
మూడు రాజధానులకు ముగింపు
ఐదేళ్లుగా అమరావతిని స్మశానంగా అభివర్ణించి, విశాఖకు రాజధానిని తరలించాలని జగన్ చేసిన ప్రయత్నాలన్నీ ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరు కానున్నాయి. విభజన చట్టంలో మార్పులు జరిగితే, జగన్ కలలుగన్న మూడు రాజధానుల కాన్సెప్ట్ చట్టపరంగా సమాధి అవుతుంది. రాజకీయంగా అమరావతిని దెబ్బతీయాలని చూసిన జగన్‌కు, కేంద్ర ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగి రాజధానిని చట్టబద్ధం చేయడం కోలుకోలేని దెబ్బ. రాష్ట్ర అభివృద్ధికి అమరావతి గుండెకాయ అని నమ్మే మెజారిటీ ప్రజలకు ఇది తీపి కబురు కాగా, జగన్ రెడ్డి పంతానికి ఇది ఒక పెద్ద చెక్.
శాశ్వత రాజధానిగా అమరావతి

చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, రాజధాని అంశాన్ని విభజన చట్టంలో చేర్పించడంలో విజయం సాధిస్తున్నారు. దీనివల్ల అమరావతి భూములిచ్చిన రైతులకు న్యాయం జరగడమే కాకుండా, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు ఒక భరోసా లభిస్తుంది. జగన్ ప్రభుత్వం హయాంలో ఏర్పడిన అనిశ్చితికి ఈ చట్టబద్ధమైన ముద్రతో తెరపడనుంది. రేపటి రోజున ఎవరు అధికారంలోకి వచ్చినా రాజధానిని మార్చలేరన్న గ్యారంటీ ప్రజల్లోకి వెళ్లడం వల్ల, కూటమి ప్రభుత్వానికి ఇది ఒక భారీ రాజకీయ మైలేజీగా మారనుంది. రెండో విడత భూసమీకరణకూ రైతులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చే అవకాశం ఉంది.