భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…whatsapp మన మిత్ర ద్వారా ఎక్కడినుండైనా ఆస్తి పన్నును చెల్లించేలా అవకాశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు వివిధ సేవలను సులభతరం చేయడానికి కూటమి ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే whatsapp ద్వారా ఏపీలోని ప్రజలకు కావలసిన సర్టిఫికెట్లను స్మార్ట్ సేవలతో అందిస్తున్న ఏపీ ప్రభుత్వం ఇకపై whatsapp మన మిత్ర ద్వారా ఎక్కడినుండైనా ఆస్తి పన్నును చెల్లించేలా అవకాశం కల్పించనుంది.
గ్రామ పంచాయతీలలో ఈ స్మార్ట్ సేవలు
ఇకపై ప్రజలు ఆస్తి పన్నులు చెల్లించటానికి ఆఫీసుల చుట్టూ, మీసేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా చాలా ఈజీగా ఆస్తి పన్ను చెల్లించే అవకాశాన్ని కల్పిస్తోంది.ఈ మేరకు ప్రభుత్వం whatsapp మన మిత్ర ద్వారా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రామ పంచాయతీలలో ఈ స్మార్ట్ సేవలు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి .
పంచాయతీలలో అవినీతికి చెక్
ఇక ఈ స్మార్ట్ సేవల ద్వారా ఆస్తి పన్నులు, నీటి పన్నులు, వ్యాపార లైసెన్సుల ఫీజులు వంటివి ఇంటి నుంచి స్మార్ట్ ఫోన్ల ద్వారా చెల్లించవచ్చు . దీనివల్ల ఆఫీసుల చుట్టూ మీ సేవ కేంద్రాల చుట్టూ తిరిగే శ్రమ తగ్గుతుంది. ఇక పంచాయతీలలో వీటి పేరుతో జరిగే అవినీతి కూడా నివారణ అవుతుంది.
ఆస్తిపన్నుల వసూలుకు స్వర్ణ పంచాయతీ పోర్టల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామపంచాయతీ లలో ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీల ద్వారా 822. 46కోట్ల రూపాయల ఆస్తి పన్నులను వసూలు చేయవలసి ఉంటుంది. అయితే కొందరు సిబ్బంది డబ్బులు వసూలు చేసి రికార్డుల్లో మాత్రం నమోదు చేయకుండా అక్రమాలకు పాల్పడుతున్న క్రమంలో గత సంవత్సరం ప్రభుత్వం స్వర్ణ పంచాయతీ పోర్టల్ ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఎవరైనా సరే డబ్బులు చెల్లించవచ్చు.
ఏపీలోని అన్ని గ్రామ పంచాయతీలలో వాట్సప్ ద్వారా పన్నుల చెల్లింపు విధానం
ఇక ఈ విధానంతో అంతకుముందుతో పోలిస్తే 2024- 2025 సంవత్సరంలో ఆస్తిపన్ను వసూళ్లు పెరిగాయి. అయితే ఇప్పుడు మరింత ఆస్తిపన్ను వసూళ్లను సులభతరం చేయడానికి whatsapp ద్వారా కూడా చెల్లింపుల విధానాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 ,326 గ్రామ పంచాయతీలలో ఇంటి యజమానులు వేరే వేరే ప్రాంతాలలో నివాసం ఉంటున్నారు. దాదాపు 15 శాతం మంది రాష్ట్రం బయట ఉంటున్నారని ఒక అంచనా .
ఎక్కడ ఉన్నవారికైనా సులువుగా పన్ను చెల్లించేలా వీలు
ఇక అటువంటి వారికి కూడా ఈ విధానంలో పన్నులు చెల్లించటం చాలా సులభతరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఆస్తి పన్నుకు సంబంధించిన వివరాలను వాట్సాప్ మన మిత్ర సేవలకు లింక్ చేస్తున్నారు అధికారులు. ఈ whatsapp సేవల ద్వారా ఎక్కడి నుంచి అయినా సరే సులువుగా పన్ను చెల్లించవచ్చని అధికారులు చెప్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సరికొత్త విధానం అమలు చేయడానికి ట్రయల్ రన్ కూడా నిర్వహించారు.
అక్టోబర్ నుండి అన్ని పంచాయతీలలో వాట్సప్ ద్వారా పన్నుల చెల్లింపు
వచ్చే అక్టోబర్ నుండి అన్ని పంచాయతీలలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఈ విధానంలో పన్నుల చెల్లింపులను ప్రోత్సహిస్తే పంచాయతీలలో జరిగే అక్రమాలు తగ్గుతాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే వాట్సప్ ద్వారా చెల్లింపుల విధానాన్ని అమలులోకి తీసుకురాబోతుంది. ఈ విధానం సక్సెస్ అయితే అటు ఏపీ లోని ప్రజలకు, ప్రభుత్వానికి చెల్లింపులు, వసూళ్లు సులభతరంగా మారుతాయి.
