పరకామణి కేసులో కీలక పరిణామం.. పోలీసులపై క్రిమినల్ చర్యలకు హైకోర్టు ఆదేశం.

భారత్ న్యూస్ విజయవాడ…పరకామణి కేసులో కీలక పరిణామం.. పోలీసులపై క్రిమినల్ చర్యలకు హైకోర్టు ఆదేశం

పరకామణి కేసులో పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశం

దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలని సీఐడీ, ఏసీబీకి హైకోర్టు సూచన

నిందితులతో పోలీసులు చేతులు కలిపారని సీఐడీ నివేదికలో వెల్లడి

తదుపరి విచారణను ఈ నెల‌ 8వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం

ఏపీలో తీవ్ర చర్చనీయాంశమైన పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తును వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సీఐడీ, ఏసీబీ సంస్థలను ఆదేశించింది.

ఇవాళ‌ ఈ కేసుపై విచారణ సందర్భంగా నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సీఐడీ సమర్పించిన నివేదికలో స్పష్టంగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో వారిపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు కూడా అవసరమని అభిప్రాయపడింది. చోరీ ఘటన మినహా, దర్యాప్తులో తేలిన ఇతర అంశాలపై సీఐడీ, ఏసీబీ విచారణ కొనసాగించవచ్చని న్యాయస్థానం వెసులుబాటు కల్పించింది.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి సీఐ జగన్ మోహన్ రెడ్డి, టూటౌన్ సీఐ చంద్రశేఖర్‌, ఎస్‌ఐ లక్ష్మీ రెడ్డిలను ఇప్పటికే వీఆర్‌కు పంపిన విషయం తెలిసిందే. తాజా ఆదేశాలతో వీరిపై సీఐడీ క్రిమినల్ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మరోవైపు పత్రాలు తారుమారు చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వన్‌టౌన్ సీఐ విజయ్‌కుమార్‌పై కూడా కేసు నమోదవుతుందా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

కౌంటింగ్ ఏర్పాట్లపై సూచనలు ఇవ్వాలని కూడా కోర్టు ఇదే విచారణలో సూచించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల‌ 8వ తేదీకి వాయిదా వేసింది.