వాట్సప్ నుంచే ఆసుపత్రుల్లో ఓపీ రిజిస్ట్రేషన్లు

భారత్ న్యూస్ విశాఖపట్నం..వాట్సప్ నుంచే ఆసుపత్రుల్లో ఓపీ రిజిస్ట్రేషన్లు

ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు నవీకరణకు వీలు

మన మిత్రలో అందుబాటులోకి ఆరోగ్య సేవలు

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పౌర సహాయక
సేవ వ్యవస్థ ‘మన మిత్ర’ వాట్సప్ నంబర్ 9552300009ద్వారా ఆరోగ్య సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ నంబర్కు వాట్సప్లో ‘హాయ్’ అని మెసేజ్ చేస్తే చాలు.. పొందాల్సిన ఆరోగ్య సేవల మెనూ తెరుచుకుంటుంది. అందులో ‘ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ అపాయింట్మెంట్ సేవలు (ఓఆర్ఎస్)’ను ఎంచుకుంటే..జిల్లా, ఆసుపత్రి, విభాగం, తదితర ఆప్షన్లు కన్పిస్తాయి.ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నంబర్ నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. దాని ద్వారా లాగిన్ కావాలి.మీ పూర్తి పేరు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్, చిరునామా,పిన్ కోడ్, జిల్లా, రాష్ట్రం వివరాలు సమర్పించాలి. అంతే,టోకెన్ నంబర్ జనరేట్ అవుతుంది. చివరి నాలుగు నంబర్లు నమోదు చేస్తే.. అపాయింట్మెంట్ బుక్ అవుతుంది. దాని ఆధారంగా కేటాయించిన సమయంలో ఆసుపత్రికి వెళ్లి వైద్యసేవలు పొందొచ్చు. సాధారణంగా అయితే, రోగి లేదా రోగి బంధువు ఆసుపత్రికి వెళ్లి ఓపీ టోకెన్ కోసం వరుసలో నిల్చోవాలి. వైద్యులను సంప్రదించాక మందుల కోసం మరోసారి క్యూలైన్లో నిల్చోవాలి. పైగా వెళ్లిన రోజు ఆ స్పెషలిస్ట్ వైద్యుల అందుబాటు, మందుల లభ్యతపై సరైన సమాచారం లేకపోతే ఆసుపత్రికి వెళ్లినా, పని కాకపోవచ్చు.

రక్త నిల్వలు, మందుల వివరాలకు..

‘ఆరోగ్య శాఖ’లో రక్త నిల్వల ఆప్షన్ను ఎంచుకుని జిల్లా పేరు నమోదు చేయాలి. ఏ, బీ, ఏబీ, ఓ, ఓహెచ్ రకాల పాజిటివ్, నెగెటివ్ రకాల రక్తం నిల్వల లభ్యత సమాచారం వస్తుంది. దీని ఆధారంగా అత్యవసర వేళల్లో సేవలు పొందొచ్చు.

ఇందులోనే ఔషధాలు శస్త్రచికిత్స సామగ్రి లభ్యత సమాచారం ఎంచుకుని జిల్లా, ఆసుపత్రి వివరాలు సమర్పిస్తే, ఆయా ఆసుపత్రుల్లో మందులు, సర్జికల్స్ నిల్వల సమాచారం వస్తుంది.

ఆరోగ్య కార్డుల సేవలకు..

మన మిత్ర వాట్సప్లో ‘ఆరోగ్య కార్డు సేవలు’ ఎంచుకుంటే.. అందులో ఎన్టీఆర్ వైద్య సేవా ఆరోగ్య కార్డుకు సంబంధించిన సేవలు డిస్ప్లే అవుతాయి. ఎన్టీఆర్ వైద్య సేవా కార్డు అప్డేషన్, ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు ప్రస్తుత స్థితిని తెలుసుకోవచ్చు. అప్డేషన్ కోసం ఫిర్యాదు నమోదు చేసి, అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయొచ్చు. జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్స అందిస్తున్న ఆసుపత్రులు, ఆరోగ్య సేవల వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు.

ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) కింద ప్రజల ఆరోగ్య రికార్డులను డిజిటల్గా భద్రపరిచే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఆయుష్మాన్ భారత్ (ఆభా) గురించి తెలుసా (నో యువర్ ఆభా) ఆప్షన్ ఎంచుకుని, మొబైల్, ఆధార్ నంబర్లు నమోదు చేయగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదుచేసి లాగిన్ కాగానే.. రోగి పేరు, వయసు, ఆభా సంఖ్య, చిరునామా ప్రత్యక్షమవుతాయి. ఏ ఆసుపత్రి నుంచైనా, ఎక్కడి నుంచైనా ఆరోగ్య సేవలు పొందాలనుకునేవారు 14 అంకెల ఆభా సంఖ్యను పొందే వీలు కల్పించారు