భారత్ న్యూస్ విజయవాడ…ఆర్.ఎస్.ఎస్ అసలు స్వభావం
‘మంచి ప్రవర్తనతో ఉంటాం’ అన్న హామీతో భారతదేశంలో మనుగడ సాగిస్తున్న ఏకైక రాజకీయ సంస్థ ఆర్.ఎస్.ఎస్ మాత్రమే! ఈ వ్యాఖ్య 1975 జులై 4న ఎమర్జెన్సీ నాటి నిషేధానికి ఉద్దేశించినదే కాదు. అంతకు చాలా ముందు, 1948 జనవరి 30న గాంధీజీ హత్య తర్వాత విధించిన నిషేధానికి సంబంధించినది కూడా! ఈ రెండు సందర్భాల్లోనూ అసత్యపు హామీలతో ఆర్.ఎస్.ఎస్ మనుగడ కొనసాగించింది. అలా అసత్యాలు, కపట విన్యాసాలే ఆర్.ఎస్.ఎస్ అసలైన ప్రాథమిక స్వభావం (బేసిక్ ఇన్‌స్టిక్ట్)! జనవరి 30న గాంధీజీ హత్య జరిగిన వెంటనే, ఫిబ్రవరి 1న ఆర్.ఎస్.ఎస్ ప్రధాన నేత ఎం.ఎస్. గోల్వాల్కర్‌ను అరెస్ట్ చేశారు.
గాంధీజీ హత్యపై దిగ్భ్రాంతి, దు:ఖాన్ని వ్యక్తం చేస్తూ ఆయన జనవరి 30న జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్‌కు పంపిన టెలిగ్రామ్‌లు ఆయనను రక్షించలేకపోయాయి. 1948 ఫిబ్రవరి 4న భారత ప్రభుత్వం ఆర్.ఎస్.ఎస్ ను నిషేధించింది. ఈ మేరకు విడుదలైన ప్రభుత్వ ప్రకటనలో ‘హిందువుల శారీరక, మానసిక, నైతిక శ్రేయస్సును ప్రోత్సహించడం. అలాగే వారిలో సోదరభావం, పరస్పర ప్రేమ, సేవా భావాలను పెంపొందించడాన్ని ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యాలుగా ప్రకటించింది. అయితే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు సభ్యులు తాము ప్రకటించిన ఆదర్శాలకు అనుగుణంగా ప్రవర్తించలేదని గుర్తించాము. సంఫ్‌ు సభ్యులు వాంఛనీయం కాని, ప్రమాదకరమైన కార్యకలాపాలలో పాల్గొంటూ వచ్చారు. వారు ప్రజలలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా కరపత్రాలు పంచారు. తుపాకులు కూడగట్టమని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంతృప్తి రేకెత్తించమని, పోలీసులు, సైన్యంపై తిరగబడమని పిలుపునిచ్చారు’ అని పేర్కొన్నారు.

‘నిషేధం కొనసాగుతున్నంత వరకు ఆర్.ఎస్.ఎస్ ను రద్దు చేయాలి’ అని గోల్వాల్కర్ ఫిబ్రవరి 6న ఆదేశించారు. అయితే ప్రభుత్వం చేసిన అన్ని ఆరోపణలను ఆయన తిరస్కరించారు. ఆర్.ఎస్.ఎస్ చట్టానికి లోబడి నడుచుకునే సంస్థ అని, చట్ట పరిమితులలోనే తన కార్యక్రమాలను కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు. గోల్వాల్కర్‌ను 1948 ఆగస్టు 6న విడుదల చేసినా, ఆయన ప్రయాణాలు నాగ్‌పూర్ వరకు మాత్రమే పరిమితం చేస్తూ ఆంక్షలు పెట్టారు. విడుదలైన అయిదు రోజుల తరువాత ఆయన నెహ్రూ, పటేల్‌లకు లేఖ రాసి ఈ పరిమితులపై ఫిర్యాదు చేశారు. ప్రధానమంత్రి కార్యదర్శులలో ఒకరిపై సెప్టెంబర్ 27న గోల్వాల్కర్‌కు సమాధానం ఇస్తూ రాసిన లేఖలో ‘ఆర్.ఎస్.ఎస్ జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా, ప్రజాహితానికి హానికరంగా ఉండే కార్యాకలాపాలలో పాల్గొన్నదన్న గట్టి ఆధారాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి.’ అని రాశారు. ‘ఆర్.ఎస్.ఎస్ ను నిషేధించే ముందు, యుపి ప్రభుత్వం ఈ మేరకు సేకరించిన ఆధారాలను ప్రధాని నెహ్రూకు పంపింది. ఇతర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద కూడా ఇలాంటి ఆధారాలు ఉన్నాయి. నిషేధం విధించిన తరువాత కూడా ఆర్.ఎస్.ఎస్ సభ్యుల ఈ తరహా కార్యకలాపాల గురించి మాకు సమాచారం అందుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్.ఎస్.ఎస్ ను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా హాని చేయని సంస్థగా ప్రభుత్వం పరిగణించలేదు.’ అని కూడా ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.