విశాఖలో సత్వా వాంటేజ్ వైజాగ్ క్యాంపస్ కు రేపు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన,

భారత్ న్యూస్ విజయవాడ…విశాఖలో సత్వా వాంటేజ్ వైజాగ్ క్యాంపస్ కు రేపు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన

Ammiraju Udaya Shankar.sharma News Editor…రూ.1,500 కోట్ల పెట్టుబడి, 25వేల మందికి పైగా ప్రత్యక్ష ఉద్యోగాలు

అమరావతి: దేశంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్, కన్సల్టింగ్ సంస్థ సత్వా గ్రూప్ ఆధ్వర్యంలో విశాఖ మధురవాడలోని హిల్-4లో నూతనంగా నిర్మించనున్న సత్వా వాంటేజ్ వైజాగ్ క్యాంపస్ కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. ఈ వేడుకకు పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ఉన్నతస్థాయి అధికారులు హాజరుకానున్నారు. రూ.1,500 కోట్ల పెట్టుబడితో 30 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ క్యాంపస్ ద్వారా ప్రత్యక్షంగా 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. పరోక్షంగా 40వేల నుంచి 50వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. విశాఖపట్నం టెక్నాలజీ, ఇన్నోవేషన్ గ్లోబల్ ఎంటర్ ప్రైజ్ సెంటర్ గా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో సత్వా గ్రూప్ పెట్టుబడులు మరింత బలాన్ని చేకూర్చనున్నాయి. రూ.1,500 కోట్ల పెట్టుబడితో రూపుదిద్దుకుంటున్న సత్వా వాంటేజ్ వైజాగ్ క్యాంపస్‌లో గ్లోబల్ ప్రమాణాల గ్రేడ్-A కార్యాలయాలు, ప్రీమియం నివాసాలు, ఇంటిగ్రేటెడ్ రిటైల్, హాస్పిటాలిటీ సౌకర్యాలు, స్మార్ట్ మొబిలిటీ, పునరుత్పత్తి శక్తి సమీకరణ, పట్టణ జీవన విధానానికి అనుగుణంగా ESG ఆధారిత మౌలిక వసతులు కల్పించనున్నారు. సత్వా వాంటేజ్ వైజాగ్ క్యాంపస్ ఏపీ తీర ప్రాంతంలోని అతిపెద్ద భవిష్యత్ ఉపాధి కేంద్రాల్లో ఒకటిగా నిలవనుంది.

1986లో సత్వా గ్రూప్ ను నెలకొల్పారు. దేశ ఆధునిక రియల్ ఎస్టేట్, టెక్నాలజీ మౌలిక సదుపాయాల రూపకల్పనలో ఈ సంస్థ కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్ ముంబై నగరాల్లో ఇప్పటి వరకు 78 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణాలను పూర్తిచేసింది. మరో 71 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణాలు అభివృద్ధి దశలో ఉన్నాయి. విశాఖలో మొదటి మూడేళ్లలో ఒక మిలియన్ చదరపు అడుగుల ఐటీ ఆఫీస్ స్పేస్ ను సత్వా సంస్థ అభివృద్ధి చేయనుంది. అదేవిధంగా వచ్చే ఐదేళ్లలో 4 మిలియన్ చదరపు అడుగుల ఐటీ ఆఫీస్ స్పేస్ ను విశాఖలో అభివృద్ధి చేయనుంది. ప్రతిభ సమృద్ధి, ఆర్థిక వేగం, పురోగామి పాలన కలిగిన అధిక వృద్ధి సామర్థ్య మార్కెట్లలో ఈ గ్రూప్ వ్యూహాత్మకంగా తన విస్తరణను కొనసాగిస్తోంది.