..భారత్ న్యూస్ అమరావతి..బెదిరింపు లేఖలు రాయడానికి మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు?

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌లోని నలుగురు కీలక మంత్రులకు అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదిరింపు లేఖలు రావడం కలకలం రేపుతోంది. మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్య ప్రసాద్, సత్యకుమార్ యాదవ్, కొల్లు రవీంద్రలకు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు అందాయి. అయితే, గతంలో నక్సల్స్ పేరుతో ఇలాంటి లేఖలు వచ్చేవి కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో వీటి పై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ మంత్రులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు చెందిన వారు కాదు.. అలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నవారు కూడా కాదు.
దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత ముమ్మరంగా సాగుతున్న తరుణంలో, ఈ లేఖలు ఎక్కడి నుంచి వచ్చాయనేది చర్చనీయాంశంగా మారింది. బెదిరింపులు ఇవ్వడానికి ఇప్పుడు మావోయిస్టులు ఎక్కడున్నారన్న ప్రశ్న వస్తోంది. అగ్రనేతలంతా ఎన్ కౌంటర్లలో ప్రాణాలు కోల్పోవడమో, లేదంటే అనారోగ్య కారణాలతో లొంగిపోవడమో జరిగింది. మిగిలిన అతి కొద్దిమంది కూడా ఛత్తీస్‌గఢ్ వంటి దట్టమైన అడవుల్లో ఎక్కడో ఒకచోట ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి, సొంత ఉనికిని కాపాడుకోవడమే గగనమైన వేళ, మంత్రులకు లేఖలు రాసేంత సాహసం వారు చేస్తారంటే ఎవరూ నమ్మడం లేదు.
కేంద్ర ప్రభుత్వం కూడా నక్సల్స్ విషయంలో అత్యంత కఠినంగా ఉంది. వచ్చే మార్చి 31వ తేదీ లోపు భారతదేశాన్ని నక్సల్స్ రహిత దేశం గా ప్రకటించాలని కేంద్ర హోం శాఖ ఇప్పటికే గడువు విధించుకుంది. అడవులను జల్లెడ పడుతున్న బలగాల ధాటికి నక్సల్స్ మూలాలు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. వారు ఇలాంటి హెచ్చరికలకు దిగడం అసాధ్యమనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ లేఖలు నక్సలైట్లు రాసినవి కావని, కేవలం పబ్లిసిటీ పిచ్చితో లేకపోతే మంత్రుల్ని బెదిరించడానికి ఆకతాయిల పనేనని అనుమానిస్తున్నారు.

ప్రస్తుతం పోలీసులు ఈ లేఖల మూలాలను వెతికే పనిలో పడ్డారు. నిఘా వర్గాలు కూడా వీటిని సీరియస్‌గా తీసుకుని రాసిన వారిని బయటకు తీసుకురానున్నారు. ఎవరు ఏ ఉద్దేశంతో రాసినా, ప్రజా ప్రతినిధులకు భద్రత పెంచడంతో పాటు, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసు శాఖ స్పష్టం చేస్తోంది.