భారత్ న్యూస్ నెల్లూరు….సాధ్యమైనంత త్వరగా అమరావతిలో జర్నలిస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అమలు: మంత్రి పార్థసారధి హామీ
*అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిలో జర్నలిస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అమలు చేసే విషయంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అమరావతి జర్నలిస్టు హౌసింగ్ ప్రాజెక్ట్ పై రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి కె పార్ఖసారధి సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై మంత్రి పార్థసారథిని అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు, పలువురు సీనియర్ జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంగళవారం కలిశారు. జర్నలిస్టుల కోసం సిఆర్డీఎ ఆధ్వర్యంలో బహుళ అంతస్థుల గృహ సముదాయాన్ని నాలుగు కేటగిరీలలో నిర్మించే నిమిత్తం 30 ఎకరాల భూమిని మందడం, తుళ్లూరు పరిధిలో అమరావతి హౌసింగ్ సొసైటీకి 2019లో కేటాయించటం జరిగిందని వారు వివరించారు. దానిని తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తూ సిఆర్డీఏ సంస్థనే డెవలపర్ గా దాని ఆధ్వర్యంలోనే ప్రాజెక్ట్ నిర్మించాలని సొసైటీ గతంలో ప్రభుత్వాన్ని కోరింది. ఇందు నిమిత్తమే సొసైటీకి కేటాయించిన భూమిని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించిన నేపథ్యంలో ప్రభుత్వం జీవో నెంబర్ 107 ఇస్తూ హ్యాపీనెస్ట్ మోడల్ లో నిర్మిస్తామని పేర్కొంది. ఇప్పుడు ఆ ఉత్తర్వులు అమలు జరిగేలా చూడాలని కోరుతూ పార్థసారధి ని అమరావతి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులతో పాటు సీనియర్ జర్నలిస్టులు కోరడం జరిగింది. అందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను, హౌసింగ్ సొసైటీ విజ్ఞప్తిని మంత్రి నారాయణ, సిఆర్డీఎ కమిషనర్ దష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. దీనిని సాధ్యమైనంత త్వరగా అమలు జరిగేలా అవసరమైన వారితో సంప్రదింపులు జరుపుతామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా మంత్రి సారధి వెంటనే సమాచార శాఖ డైరక్టర్ విశ్వనాధ్ కి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సమాచార శాఖ డైరక్టర్ కూడ ఈ విషయంపై సత్వరమే సంప్రదింపులు జరుపుతామని ఆయనను కలిసిన జర్నలిస్టు సంఘ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. మంత్రి ని కలిసిన వారిలో అమరావతి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి పాటిబండ్ల నాగశ్రీనినాసరావు, సొసైటీ డైరెక్టర్లు చావా రవి, టివి 9 ఈశ్వర్ , మహాటివి శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు ఆంధ్రప్రభ బ్యూరో ఛీఫ్ గోపీ, ఆంధ్రజ్యోతి సత్యనారాయణ, హిందూ డిప్యూటీ ఎడిటర్ శ్రీనాధ్, ఎస్ మల్లిఖార్జున్ , భి నాగేశ్వర రావు ఉన్నారు.
