భారత్ న్యూస్ నెల్లూరు….నారా వారి సారా’ బయటపెట్టినందుకే కక్ష.. ఏ టెస్టుకైనా సిద్ధం: జోగి రమేశ్

Ammiraju Udaya Shankar.sharma News Editor…సీఎం చంద్రబాబు, లోకేశ్ పై జోగి రమేశ్ ఫైర్
నారా వారి సారా వ్యవహారం బయటపెట్టినందుకే కక్ష సాధింపు అని మండిపాటు
తనను బద్నాం చేసి వైసీపీని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపణ
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పై వైసీపీ నేత జోగి రమేశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తాను ‘నారా వారి సారా’ వ్యవహారాన్ని బయటపెట్టినందుకే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, తనను ఓ కేసులో ఇరికించి పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
జోగి రమేశ్ మాట్లాడుతూ, “రాష్ట్రంలో నారా వారి సారా దందాను ఇబ్రహీంపట్నం కేంద్రానికి వెళ్లి మరీ ప్రజల ముందు ఉంచాను. అప్పటి నుంచే నాపై కుట్రలు మొదలుపెట్టారు. ఈ అంశాన్ని రాజకీయంగా పక్కదారి పట్టించేందుకే నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. చంద్రబాబు, లోకేశ్ నన్ను బద్నాం చేసి, వైసీపీని డ్యామేజ్ చేయాలని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు” అని విమర్శించారు.
ఈ క్రమంలో తాను ఏ విచారణకైనా సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. “లై డిటెక్టర్ టెస్టుకు, సీబీఐ విచారణకు, చివరికి నార్కో టెస్టుకైనా నేను సిద్ధం. తిరుమల వెంకన్న సన్నిధిలో ప్రమాణం చేస్తానని చెప్పాను. విజయవాడ దుర్గమ్మ వద్ద నా కుటుంబంతో సహా ప్రమాణం చేశాను. అయినా ఎవరూ స్పందించడం లేదు” అని జోగి రమేశ్ తెలిపారు. చంద్రబాబు తన హృదయాన్ని, వ్యక్తిత్వాన్ని గాయపరిచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేసు రిమాండ్ రిపోర్ట్‌లో తన పేరు లేనప్పటికీ, ఫేక్ వాట్సాప్ చాట్లు, వీడియోలను సృష్టించి తనపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని తెలిపారు. తనకు జనార్ధన్ అనే వ్యక్తితో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. “ఏ తప్పు చేయని జోగి రమేశ్ మీకు దొరికాడా? చంద్రబాబు, లోకేశ్ ఎల్లకాలం అధికారంలో ఉండరు. ఏదో ఒకరోజు చట్టం ముందు సమాధానం చెప్పాల్సి వస్తుంది” అని హెచ్చరించారు. ఈ కేసులో సిట్ అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిజాయతీగా విచారణ జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.