జగన్ పనైపోయిందని చెప్పే కుటిల ప్రయత్నం చేస్తున్నారు: అంబటి రాంబాబు

భారత్ న్యూస్ విజయవాడ…జగన్ పనైపోయిందని చెప్పే కుటిల ప్రయత్నం చేస్తున్నారు: అంబటి రాంబాబు

అనేక ఖాళీలుంటే… పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికలు మాత్రమే పెట్టారన్న అంబటి

బయటి వ్యక్తులతో దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపణ

చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలను చూడలేదని వ్యాఖ్య

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై విజయవాడలోని ఎలక్షన్ కమిషన్ కార్యాలయం ముందు వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఈసీకి వారు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ… చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలను తన చరిత్రలో చూడలేదని అన్నారు. ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకుని వారి ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం ఇవ్వాలని ప్రాధేయపడాల్సి వస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఖాళీ స్థానాల్లో కాకుండా… కేవలం పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు పెట్టారని… ఈ స్థానాల్లో గెలిచి జగన్ పనైపోయిందని చెప్పే కుటిల ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఓటరు స్లిప్పులను లాక్కొని, వాళ్ల మనుషులతో దొంగ ఓట్లు వేయిస్తున్నారని అంబటి విమర్శించారు. గతంలో నంద్యాలలో ఇలాగే చేసి గెలిచారని చెప్పారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తులతో దొంగ ఓట్లు వేయించి గెలవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రజాప్రతినిధులను కూడా ఇళ్ల నుంచి బయటకు రానివ్వడం లేదని మండిపడ్డారు. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. టీడీపీ, ఈసీ, పోలీసులు కలిసిపోతే చేసేదేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ దుర్మార్గాలను అర్థం చేసుకుని ప్రజలు సమాధానం చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు.