..భారత్ న్యూస్ అమరావతి..పేదల ఇళ్ల పట్టాల రద్దుపై వైఎస్ జగన్ ఆగ్రహం

Ammiraju Udaya Shankar.sharma News Editor…పేదల (Poor people’s) ఇళ్ల పట్టాలను (Houses Pattas ) రద్దు చేయాలని చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వైఎస్ జగన్ (YS Jagan) తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేస్తూ చంద్రబాబు సర్కార్‌ను విధ్వంసకర ప్రభుత్వమని విమర్శించారు. పేదల సొంతింటి కలలను నాశనం చేసే అధికారం చంద్రబాబుకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. పేదలకు ఏదైనా ఇవ్వని ప్రభుత్వం, వారికి అందినవాటినే లాక్కునే రద్దుల ప్రభుత్వం ఇదేనని జగన్ వ్యాఖ్యానించారు.
మా ప్రభుత్వ హయాంలో అక్కచెల్లెమ్మల పేరుమీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఇళ్లస్థలాలను రద్దు చేయడం పేదలపై కత్తి పెట్టడమేనని, ఇది మానవత్వం లేని నిర్ణయమే అని అన్నారు. పేదల ఇంటిపట్టాల కోసం తాము 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల పట్టాలను ఇచ్చామని, వాటి కోసం రూ.11,871 కోట్లు ఖర్చు చేశామని జగన్ గుర్తుచేశారు. ఈ పట్టాల విలువ మార్కెట్ రేట్ల ప్రకారం రూ.1.5 లక్షల కోట్లకు పైమాటేనని, ఒక్కో పట్టా విలువ రూ.2.5 లక్షల నుంచి రూ.10–15 లక్షల వరకు ఉంటుందని వివరించారు.
వైసీపీ ఐదేళ్ల కాలంలో పేదల ఇళ్ల కోసం ధర్నాలు, ఆందోళనలు కనిపించకపోవడమే మా చిత్తశుద్ధికి నిదర్శనం. మా హయాంలో 21.75 లక్షల ఇళ్ల నిర్మాణానికి శాంక్షన్ ఇచ్చి 17,005 కాలనీలు నిర్మించామని, అందులో 9 లక్షలకు పైగా ఇళ్లను పూర్తి చేశామని చెప్పారు. 2023 అక్టోబర్ 12న ఒకేసారి 7.43 లక్షల ఇళ్లను ప్రారంభించడం చరిత్రాత్మక ఘట్టమని, అలాంటి ఘనతను చంద్రబాబు ఎప్పుడైనా సాధించారా అని ప్రశ్నించారు.
పేదల ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన 12 రకాల సామాన్లు తక్కువ ధరకే అందించి ఒక్కో కుటుంబానికి రూ.40 వేల లాభం చేకూర్చామని, 20 టన్నుల ఇసుక ఉచితంగా ఇవ్వడంతో మరో రూ.15 వేల మేలు జరిగిందని తెలిపారు. పావలా వడ్డీకి ఇచ్చిన రుణాలపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరించి ప్రతి ఇంటికి సుమారు రూ.35 వేల సహాయం అందించామని చెప్పారు. దీంతో కలిపి ఒక్కో ఇంటికి కేంద్రం ఇచ్చే రూ.1.8 లక్షలకు అదనంగా రూ.2.7 లక్షల లాభం చేకూరిందని, మౌలిక సదుపాయాల కోసం మరో లక్ష రూపాయలు ఖర్చు పెట్టామని జగన్ వివరించారు.
అంతేకాకుండా, కాలనీల్లో నీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కోసం రూ.3,555 కోట్లు ఖర్చు చేశామని, మొత్తంగా రూ.35,300 కోట్లు ఖర్చు పెట్టామని అన్నారు. కానీ 16–17 నెలలుగా అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందని జగన్ నిలదీశారు. పేదల ఇళ్ల పథకం ముందుకు సాగకుండా టీడీపీ నేతలతో కోర్టుల్లో కేసులు వేయించారని, అమరావతిలో 50 వేల పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను సామాజిక అసమతుల్యత వస్తుందని వాదిస్తూ రద్దు చేశారని తెలిపారు. ఇప్పుడు ఆ పట్టాలను ప్రైవేటు ఇండస్ట్రియల్ పార్కుల కోసం వినియోగించాలనడం పేదలపై ద్రోహమని అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వం ఇళ్ల పట్టాల రద్దు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. పేదలపై జరిగే అన్యాయాన్ని తాము సహించబోమని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని, కేడర్ నిరసనలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.