వాట్సాప్ ద్వారా క్యాస్ట్, ఇన్‌కం, బర్త్ సర్టిఫికెట్లు పొందొచ్చు.

భారత్ న్యూస్ రాజమండ్రి…వాట్సాప్ ద్వారా క్యాస్ట్, ఇన్‌కం, బర్త్ సర్టిఫికెట్లు పొందొచ్చు..!

కులం, ఆదాయం, నివాసం వంటి ధ్రువీకరణ పత్రాలను పొందడానికి ఇకపై ప్రజలు రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. మీసేవ కేంద్రాలు లేదా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని అంతకన్నా లేదు. మీ సేవ సర్వీసెస్‌ ఆన్‌ వాట్సప్‌’ ద్వారా ఈ సేవలు ఇంట్లో కూర్చొని ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో పొందొచ్చు.వాట్సాప్‌ నంబరు 80969 58096 ద్వారా సుమారుగా 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కి పైగా సేవలు ఇకపై పౌరులకు లభించనున్నాయి. ఇది పరిపాలనలో సాంకేతికతను వినియోగించడం ద్వారా పౌరులకు మరింత సౌలభ్యాన్ని అందించే దిశగా తీసుకున్న ముఖ్యమైన ముందడుగు.ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ వాడే గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పౌరులు తమ ఇంటివద్ద కూర్చునే ఆదాయం, కులం, నివాసం, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, వివాహ రిజిస్ట్రేషన్‌, మార్కెట్‌ వాల్యూ సర్టిఫికెట్లు వంటి అన్ని రకాల ధ్రువపత్రాల కోసం ఫోన్ నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా.. విద్యుత్తు, నీటి, ఆస్తి పన్ను చెల్లింపులు, రెవెన్యూ, ఆర్టీఏ, పోలీసు, పౌరసరఫరాలు, పంచాయతీ రాజ్, దేవాలయాల సేవలు సైతం ఈ వేదిక ద్వారా అందించనున్నారు.

దరఖాస్తు విధానం..

అధికారిక మీ సేవ వాట్సప్‌ నంబరు 80969 58096ను మీ మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి.

ఆ నంబరుకు Hi లేదా Menu అనే ఆప్షన్‌ టైప్‌ చేసి పంపిస్తే అందుబాటులో ఉన్న సేవల జాబితా కనిపిస్తుంది.

ఆ తర్వాత, ఆధార్‌ ఆధారిత ధ్రువీకరణ (OTP) ప్రక్రియను పూర్తి చేయాలి.

అవసరమైన పత్రాలను, స్కాన్‌ చేసిన ప్రతులను నేరుగా వాట్సప్‌లోనే అప్‌లోడ్‌ చేయవచ్చు.

దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వే ద్వారా సురక్షితంగా చెల్లించవచ్చు.

దరఖాస్తు స్టేటస్, అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశం (SMS) రూపంలో వస్తాయి.

సర్టిఫికెట్‌ సిద్ధం కాగానే, దాని డౌన్‌లోడ్‌ లింక్‌ నేరుగా వాట్సప్‌లోకి వస్తుంది.

ఈ సరికొత్త సాంకేతిక వేదిక ద్వారా దరఖాస్తు ప్రక్రియ మొత్తం పూర్తిగా పారదర్శకంగా, వేగంగా పూర్తి అవుతుందని ప్రభుత్వం హామీ ఇస్తోంది.