మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి..!

భారత్ న్యూస్ అనంతపురం…మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి..!

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టులు, భద్రత బలగాల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో పలువురు అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం. ఇప్పటికీ రెండు వర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

మారేడుమిల్లి ప్రాంతంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఉదయం 6 గంటల నుంచి ఏడు గంటల మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లో ఆరుగురు మావోయిస్టుల మృతి చెందారని పోలీసులు తెలిపారు. వారిలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఉన్నట్లు తెలుస్తోంది.

మారేడుమిల్లి ప్రాంతంలోని లోతట్టు అటవీ ప్రాంతాల్లో మావోయిస్ట్ అగ్ర నేతలు తల దాచుకున్నారనే విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని కూబింగ్ చేపట్టారు. ఇంతలో ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా, అతని భార్య సహా ఆరుగురు మావోయిస్టులు మరణించినట్టు సమాచారం. అయితే అధికారికంగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

టైగర్‌ జోన్‌లో ఉదయం 6-7 గంట మధ్య ఎన్‌కౌంటర్‌ ప్రారంభమైంది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన హిడ్మాపై రూ. కోటి, ఆయన భార్యపై రూ.50 లక్షల రివార్డ్‌ ఉంది. మావోయిస్టు పార్టీలో గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మాకు మంచి పేరు ఉంది. ఆపరేషన్‌ కగార్‌ తీవ్రతరం అవడంతో చత్తీస్‌గఢ్‌ నుంచి మారేడుమిల్లి వైపు హిడ్మా టీమ్‌ వచ్చినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు భద్రతా దళాలు భారీ ఎత్తున కూంబింగ్ చేపట్టారు.

సుక్మా జిల్లా పూవర్తికి చెందిన హిడ్మా, మావోయస్ట్ కార్యకలాపాల్లో క్రియాశీలంగా వ్యవహరించారు. విలాస్, హిడ్మాల్, సంతోష్‌ అనే పేర్లతోనూ తిరిగిన హిడ్మా వయసు 50 ఏళ్లు పైనే..! హిడ్మాకు హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషలపై మంచి పట్టు ఉంది. దండకారణ్యంలో మావోయిస్టు కమిటీల్లో కీలకంగా మారిన హిడ్మా, 2017లో 25మంది సీఆర్పీఎఫ్‌ జవాన్ల మృతికి కారణమయ్యారు. గెరిల్లా వార్‌ఫేర్‌ స్కిల్స్‌లో హిడ్మాది తిరుగులేని టాలెంట్‌.