భారత్ న్యూస్ గుంటూరు…అర్హులైన పాత్రికేయులందరికీ అక్రెడిటేషన్ ఇవ్వాలి
– గుంటూరు జిల్లా ఐ&పిఆర్ డిడికి నిమ్మరాజు వినతి
గుంటూరు, అక్టోబర్ 11: ప్రభుత్వ ఆదేశాలు, నిబంధనలను గౌరవిస్తూనే అర్హులైన పాత్రికేయులందరికీ అక్రెడిటేషన్ సౌకర్యం కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు కోరారు. సమాచార, పౌర సంబంధాల శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన తన చిరకాల మిత్రుడు ఎల్.రమేష్ ను గుంటూరులోని కార్యాలయంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు.
ఈ సందర్భంగా నిమ్మరాజు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా జర్నలిస్టులు వుండేవారని, 1981 నుంచి 1999 వరకు తాను 10 ఏళ్లపాటు అక్రెడిటేషన్ కమిటీ, దాడుల నివారణ కమిటీలలో సభ్యునిగా వ్యవహరించానని గుర్తుచేశారు. ఆ సమయంలో డీపీఆర్వోలుగా సేవలందించిన ఎ.విఠల్ రావు, ఎల్.స్వర్ణలత, ఎస్.లాల్ జాన్ తదితరులు, ఏఒక్కరు కూడా తనకు అక్రెడిటేషన్ కార్డు లేదనకుండా పాత్రికేయులకు ఎంతగానో సహకరించారని తెలిపారు. అలాగే నాటి కలెక్టర్లు, ఆర్టీసీ ఉన్నతాధికారులు సహకరించారు. సుదీర్ఘకాలం తర్వాత ఇపుడు కమిటీలు ఏర్పాటవుతున్నందున అర్హులకు జీవోలు అడ్డువస్తే ఆలోచించి, పరిశీలించి, తక్షణం తగిన నిర్ణయం తీసుకునే అవకాశం వుందన్నారు. గతంలో తాము ఇదే రీతిలో వ్యవహరించామని ఆయన పేర్కొన్నారు.
1999-2001 మధ్య తాను విశాఖపట్నంలో పనిచేస్తున్నపుడు తొలుత ఎ.వి.నరసింహులు, ఆపై ఎల్.స్వర్ణలత డీపీఆర్వోలుగా పనిచేస్తే, రమేష్ ఏపీఆర్వోగా పనిచేశారని నిమ్మరాజు గుర్తుచేశారు. ఆ సమయంలో తాను అక్కడ కూడా అక్రెడిటేషన్ కమిటీ సభ్యునిగా పనిచేశానన్నారు. 1996లో ఏపీఆర్వోగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన రమేష్ 2004 వరకు విశాఖలోనూ, ఆపై డివిజనల్ పీఆర్వో, డీపీఆర్వో, అడిషనల్ డైరెక్టర్ గా గత నెల వరకు ఉత్తరాంధ్రలో పనిచేస్తూ జర్నలిస్టులతో సన్నిహితంగా మెలిగారని నిమ్మరాజు తెలిపారు. గత 35 ఏళ్లుగా కార్యాలయంలో వివిధ హోదాల్లో పనిచేస్తూ ఇటీవల కొంతకాలం ఇంచార్జ్ డీపీఆర్వోగా, ప్రతి జర్నలిస్టు కు సహకారిగా పనిచేస్తూ వచ్చిన డివిజనల్ పీఆర్వో శ్యామ్ ను ఈ సందర్భంగా నిమ్మరాజు అభినందించారు.
