భారత్ న్యూస్ గుంటూరు….కోడి పందేలను అడ్డుకోండి: హైకోర్టు ఆదేశం
సంక్రాంతి పండగకు కోడి పందేలు నిర్వహిస్తే జంతుహింస నిరోధక చట్టం 1960, ఎపి జూద నిరోధక చట్టం-1974 కింద చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, ఎసిపిలను హైకోర్టు ఆదేశించింది. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కోడి పందేలు నిర్వహించే సంప్రదాయ నేపథ్యంలో ఆ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలంది. చట్టాల ఉల్లంఘనలు జరిగితే వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని అధికారులను హెచ్చరించింది. కింది స్థాయి అధికారులు చట్టాలను అమలు చేయకపోతే వారిపై జిల్లా స్థాయి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంది. తనిఖీలకు ఎస్ఐ స్థాయికి తగ్గని పోలీసు అధికారి, తహశీల్దార్, భారత జంతు సంక్షేమ బోర్డు ప్రతినిధి లేదా జంతు సంరక్షణ కోసం పనిచేసే ఎనిఒ ప్రతినిధులకు కమిటీలో చోటు కల్పించాలంది. కమిటీ తనిఖీలు చేసి ఉన్నతాధికారులకు సహకరించాలని జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప తీర్పు చెప్పారు.
