భారత్ న్యూస్ అనంతపురం..మహారాష్ట్రను కుదిపేస్తున్న ‘కెప్టెన్ బాబా’.. వందల కోట్ల ఆస్తులు, 150 మంది బాధితులు?
మహారాష్ట్రలో ‘కెప్టెన్ బాబా’గా పేరొందిన దొంగస్వామి అశోక్ కారత్ అకృత్యాలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జ్యోతిష్యం, పూజల పేరుతో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడటం, భక్తులను మోసగించి వందల కోట్లు కూడబెట్టడం వంటి తీవ్ర ఆరోపణలతో అరెస్టయిన అతడిని, నాసిక్ కోర్టు ఏప్రిల్ 14 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది.
కుటుంబ సమస్యలతో తన వద్దకు వచ్చే మహిళలకు తీర్థం పేరుతో మత్తుమందు ఇచ్చి, వారు స్పృహ కోల్పోయాక అత్యాచారం చేసేవాడని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, పనికిరాని చింతగింజలను మంత్రించిన రాళ్లుగా నమ్మించి కిలోకు లక్ష రూపాయలకు, సాధారణ తేనెను పవిత్రమైనదిగా చెప్పి కిలోకు రూ.9 లక్షలకు విక్రయించేవాడు. భక్తులను నమ్మించేందుకు 20 అడుగుల రిమోట్ కంట్రోల్ పామును కూడా ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ కేసు తీవ్రత దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు అశోక్ కారత్‌పై 8 అత్యాచారం కేసులు, 2 మోసం కేసులు సహా మొత్తం 10 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. సిట్ ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు 150కి పైగా ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆయన కార్యాలయం నుంచి 58 అభ్యంతరకర వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వ్యవహారంలో అశోక్ కారత్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలీ చకాన్కర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ కుంభకోణం అమెరికాలోని ‘ఎప్స్టీన్ ఫైల్స్’ కన్నా దారుణమైందని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మరోవైపు, ఈ కేసులో నిందితురాలిగా ఉన్న అశోక్ కారత్ భార్య కల్పన పరారీలో ఉండటంతో పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు.

పదో తరగతి ఫెయిలైన అశోక్ కారత్, మర్చంట్ నేవీలో పనిచేశానని చెప్పుకుంటూ ‘కెప్టెన్ బాబా’గా పేరు తెచ్చుకున్నాడు. అతని వద్ద పనిచేసిన ఓ ఉద్యోగి రహస్యంగా కెమెరా పెట్టి వీడియోలు తీయడంతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. అశోక్ ప్రస్తుతం నాసిక్ సెంట్రల్ జైలులో ఉన్నాడు.