భారత్ న్యూస్ గుంటూరు…..బిల్లు తేదీ దాటితే ఆటోమేటిక్‌గా సరఫరా నిలిపివేత
చేతులెత్తేస్తున్న విద్యుత్ సిబ్బంది
ఎన్నిరోజులైనా.. ప్రత్యేక నిపుణుడు వచ్చేవరకూ వేచి ఉండాల్సిందే..

అంతవరకు కరెంట్ పునరుద్ధరణ జరగని వైనం
తలలు పట్టుకుంటున్న వినియోగదారులు
సీతంపేట ఏజెన్సీలో విద్యుత్ స్మార్ట్‌మీటర్లను వినియోగిస్తున్న పరిస్థితి దయనీయంగా మారింది. అనుకున్న సమయానికి బిల్లు చెల్లించక పోయినా.. లేట్‌గా చెల్లించినా.. రెండు, మూడు నెలల నుంచి కట్టకపోయినా వెంటనే ఆటోమేటిక్‌గా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అయితే ఇది మాములే కదా అని అనుకోవచ్చు. అయితే సదరు వినియోగదారులు హుటాహుటిన ఫైన్‌తో బిల్లులు చెల్లిస్తున్నా.. వెనువెంటనే విద్యుత్ పునరుద్ధరణ జరగడం లేదు. దీనిపై ఆ శాఖాధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో ‘స్మార్ట్’ వినియోగదారులు తలలు పట్టుకుంటున్నారు.
ఇదీ పరిస్థితి..
గత ఏడాది మన్యంలోని వ్యాపార, గృహ, ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ స్మార్ట్‌మీటర్లను బిగించారు. వినియోగదారులకు ఇష్టం లేకపోయినప్పటికీ బలవంతంగా మొదటివిడతలో మండలంలో సుమారు 1500వరకు ఏర్పాటు చేశారు. ఇక సీతంపేట గ్రామంలో ప్రయోగాత్మకంగా 380 సర్వీసులకు ఈ మీటర్లు బిగించారు. అయితే విద్యుత్ బిల్లు ఎంత వస్తుందో తెలియక వినియోగదారులు తికమకపడుతున్నారు. గతంలో ప్రతి నెలా విద్యుత్ బిల్లులు తమ చేతికి వచ్చేవని, ఇప్పుడు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నామో తెలియడం లేదని పలువురు ఆరో పిస్తున్నారు. అంతేకాకుండా విద్యుత్ బిల్లులు ఎక్కువ మొత్తంలో వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా విద్యుత్ బిల్లు అనుకున్న సమయానికి చెల్లించకపోతే ఫైన్‌తో చెల్లింపులు చెల్లించాల్సి ఉంటుంది. అలాకాకపోతే విద్యుత్ సిబ్బంది సదరు వినియోగదారుల ఇళ్లకు వెళ్లి సరఫరా నిలుపుదల చేస్తామని హెచ్చరిస్తుంటారు. మొండి బకాయిదారుల ఇళ్లకైతే కరెంట్‌ను కట్ చేస్తారు. బిల్లులు చెల్లించిన తరువాత వెంటనే విద్యుత్‌ను సరఫరాను పునరుద్ధరిస్తారు. అయితే స్మార్ట్‌మీటర్‌లను వినియోగిస్తున్న వినియోగదారుల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆలస్యంగా విద్యుత్ బిల్లు చెల్లిస్తే.. ఆటోమేట్‌గా సరఫరా నిలిచిపోతుంది. తిరిగి ఎప్పుడు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ అవుతుందో ఎవరికీ తెలియదు. సుమారు మూడు రోజల తర్వాత శ్రీకాకుళం నుంచి వచ్చిన సాఫ్ట్‌వేర్ నిపుణుడు అప్‌డేషన్ చేశాక సీతంపేటలో పలువురు వినియోగదారుల ఇళ్లకు విద్యుత్ పునరుద్ధరణ జరిగింది. కాగా మారుమూల గ్రామాల్లో సిగ్నల్ వ్యవస్థ అందుబాటులో లేని చోట ఇంకెన్ని రోజులకు సరఫరా అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
బిల్లు మొత్తం కట్టినా..
సీతంపేట గ్రామానికి చెందిన ఓ వినియోగదారుడు మూడు నెలల కిందట తమ ఇంటికి సూర్యఘర్ పథకం కింద సోలార్‌ప్యానెల్ సిస్టంను ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడే కేటగిరీ -2కింద విద్యుత్ సిబ్బంది ఈ స్మార్ట్‌మీటర్‌ను బిగించారు. అయితే బిల్లు చెల్లించలేదనే కారణంతో ఇటీవల విద్యుత్ నిలిచిపోయింది. దీంతో మూడు నెలల బిల్లు రూ.8200 ఆన్‌లైన్‌లో ఒక్కసారిగా చెల్లించారు. అయినప్పటికీ ఇంతవరకు విద్యుత్ పునరుద్ధరణ జరగలేదు. దీనిపై స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్‌కు వెళ్లి సిబ్బందిని ప్రశ్నించగా.. వారు పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. త్వరలో విద్యుత్ పునరుద్ధరణ జరుగుతుందని చెప్పి పంపేస్తున్నారని సదరు వినియోగదారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనుకున్న సమయానికి చెల్లించలేక..
సీతంపేట గ్రామానికి చెందిన మరో వినియోగదారుడి నివాసానికి గతేడాది విద్యుత్‌శాఖ సిబ్బంది స్మార్ట్‌మీటర్‌ను బిగించారు. అయితే సదరు వినియోగదారుడు ప్రతినెలా విద్యుత్ బిల్లును ఆన్‌లైన్‌లోనే పేమెంట్ చేస్తున్నారు. గత రెండు నెలలుగా క్యాంప్‌లో ఉండడంతో అనుకున్న సమయానికి బిల్లు చెల్లించలేకపోయారు. దీంతో ఇటీవల ఆయన ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సదరు వినియోగదారుడు వెంటనే తన మొబైల్ ద్వారా విద్యుత్‌బిల్లును ఆన్‌లైన్‌లో చెల్లించాడు. అయినప్పటికీ ఇంతవరకు విద్యుత్ పునరుద్ధరించలేదు. దీనిపై స్థానిక విద్యుత్ సిబ్బందిని సంప్రదించగా తామేమీ చేయలేమని, కాల్ సెంటర్‌కు సమాచారం అందిస్తామని సమాధానమిచ్చారు. దీంతో బాధితుడు ఈసురోమంటూ వెనుదిరగాల్సి వచ్చింది.
గతంలోనే వ్యతిరేకత
స్మార్ట్ మీటర్ల వినియోగంపై సీతంపేట మన్యంలో గిరిజన సంఘాల నుంచిగతంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకే వాటిని తీసుకువచ్చారని ఆరోపించాయి. అయినప్పటికీ గత వైసీపీ ప్రభుత్వం స్మార్ట్‌మీటర్‌ల ఏర్పాటు ప్రక్రియపై వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, సచివాలయాలు, రైతు సేవా కేంద్రాలు, కేటగిరీ-2కింద వచ్చే వ్యాపార, వాణిజ్య సముదాయాలు, సోలార్ సిస్టం వినియోగించే గృహ వినియోగదారుల ఇళ్లకు వాటిని ఏర్పాటు చేశారు. అయితే ఈ మీటర్ల వినియోగంలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించడంలో సంబంధిత సిబ్బంది విఫలమవుతున్నారు.
ట్రాన్స్‌కో డీఈ ఏమన్నారంటే..
స్మార్ట్‌మీటర్లు వినియోగిస్తున్న వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు మా దృష్టికి వచ్చాయి. మొత్తంగా ఎనిమిది మంది విద్యుత్ బిల్లులు ఆలస్యంగా చెల్లించడం వల్ల వారి గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన దానిపై ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈ సమస్య మా పరిధిలో లేదు. స్మార్ట్‌మీటర్‌లోని సర్వర్‌కు లింక్ అవ్వని కారణంగా ఇంకా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదు. త్వరలో సమస్య పరిష్కారమవుతుంది.’ అని ఏపీఈపీడీసీఎల్ డీఈఈ విష్ణుమూర్తి చెప్పారు.