భారత్ న్యూస్ అనంతపురం…ఏపీ లిక్కర్ స్కామ్ కేసు: కోర్టులో చెవిరెడ్డికి మరోసారి చుక్కెదురు
చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన విజయవాడ ఏసీబీ కోర్టు
కేసులో చెవిరెడ్డి పాత్ర కీలకమని కోర్టులో వాదనలు వినిపించిన ప్రభుత్వ న్యాయవాది
బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ప్రభుత్వ న్యాయవాది
ప్రభుత్వ న్యాయవాది వాదనలు పరిగణనలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి కోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు నిన్న తిరస్కరించింది. గత వారం ఈ పిటిషన్పై ఇరువర్గాల వాదనలు ముగిశాయి.
దీనిపై నిన్న సాయంత్రం కోర్టు తీర్పును వెలువరించింది. ప్రాసిక్యూషన్ వాదనలను పరిశీలించిన న్యాయస్థానం.. ఈ దశలో బెయిల్ మంజూరు చేయడం దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది.
ఈ కేసులో చెవిరెడ్డి కీలక పాత్ర పోషించారని ప్రభుత్వ న్యాయవాది జేడీ రాజేంద్రప్రసాద్ కోర్టులో వాదనలు వినిపించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లకు పంచేందుకు మద్యం ముడుపుల సొమ్మును కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధులకు చేరవేశారని ఆయన పేర్కొన్నారు.

చెవిరెడ్డికి చెందిన సంస్థలపై సిట్ అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించి, పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసు ఇప్పటికీ విచారణ దశలో ఉండటంతో చెవిరెడ్డికి బెయిల్ మంజూరు చేస్తే తదుపరి దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశం ఉందని వాదించారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయాధికారి భాస్కరరావు.. చెవిరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చారు. ఇంతకు ముందు కూడా చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది.