భారత్ న్యూస్ మంగళగిరి…Ammiraju Udaya Shankar.sharma News Editor…వైసీపీ డిజిటల్ యుగంలోని మరో మెట్టు ఎక్కుతోంది. వైసీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ (పీఏసీ ) సమావేశంలో కీలక ప్రకటన చేసిన పార్టీ అధ్యక్షుడు జగన్, త్వరలో తమ పార్టీ తరఫున ఓ ప్రత్యేక యాప్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ యాప్ ద్వారా టీడీపీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న వేధింపులు, అన్యాయాలు, అరాచకాలు అన్నింటినీ నేరుగా పార్టీకి తెలియజేసే వీలుంటుందని వివరించారు.
వ్యతిరేక పార్టీల నుండి లేదా అధికారుల నుండి అన్యాయంగా ఇబ్బందులు ఎదురైతే, బాధితులు ఆ వివరాలను ఆ యాప్‌లో నమోదు చేయవచ్చని జగన్ తెలిపారు. అలాగే, సంబంధిత ఆధారాలు – వీడియోలు, డాక్యుమెంట్లు, ఫోటోలు వంటి పత్రాలు – కూడా అప్లోడ్ చేయొచ్చని చెప్పారు. ఈ ఫిర్యాదులన్నీ డిజిటల్ సర్వర్లోకి ఆటోమేటిక్‌గా వెళ్లి భద్రపరచబడతాయని, పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై కచ్చితంగా విచారణ జరుగుతుందని హామీ ఇచ్చారు.
ఈ ప్రకటన ద్వారా పార్టీ ప్రజలకు నేరుగా అందుబాటులోకి రావడమే కాక, ప్రజల అనుభవాలను డాక్యుమెంట్ చేయడంలో స్పష్టమైన అడుగు వేసినట్లైంది. ‘‘తప్పు చేసిన వారందరికీ సినిమా చూపించడం ఖాయం. చంద్రబాబు వేసిన విత్తనం ఇప్పుడే చెట్టవుతోంది’’ అంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల పక్షాన న్యాయ పోరాటానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
