భారత్ న్యూస్ విశాఖపట్నం..క్యాన్సర్ తో పోరాడుతున్న అనంతపురం బాలుడికి మంత్రి నారా లోకేష్ అండ
సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.12 లక్షల ఆర్థికసాయం అందజేత
అమరావతి: చదువుకోవాల్సిన వయసులో బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్న 12 ఏళ్ల బాలుడికి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. క్యాన్సర్ వైద్య చికిత్సకు సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.12 లక్షల ఆర్థికసాయం అందజేశారు. అనంతపురం పట్టణం వేణుగోపాల్ నగర్ కు చెందిన 12 ఏళ్ల కె.చిన్నికృష్ణ ఉదయ్ పవన్ కుమార్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. దీంతో బెంగుళూరులోని శ్రీ శంకర క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా బాలుడికి చికిత్స అందిస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్, కీమోథెరపీ కోసం సాయం అందించి బాలుడి ప్రాణం నిలపాలంటూ గత నెల అనంతపురం జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేష్ ను కలిసి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం బాలుడి వైద్య చికిత్సకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.12 లక్షల ఎల్ వోసీ అందజేశారు. మంత్రి లోకేష్ సాయం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
