4 కార్పొరేష‌న్లు: 51 మంది డైరెక్ట‌ర్లు.. ఏం పందేరం బాబూ!

భారత్ న్యూస్ మంగళగిరి…4 కార్పొరేష‌న్లు: 51 మంది డైరెక్ట‌ర్లు.. ఏం పందేరం బాబూ!

ఏపీలో ప‌ద‌వుల పందేరంలో హైలెట్‌గా నిలిచే వార్త ఇది!. నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో సీఎం చంద్ర‌బాబుపై ఉన్న ఒత్తిళ్ల‌కు ఇది నిలువుట‌ద్దంగా మారుతోంది. ప్ర‌స్తుతం టీడీపీలో అనేక మంది నాయ‌కులు ప‌ద‌వుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే.. వీరిని సంతృప్తి ప‌రిచేందుకు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. దీంతో కార్పొరేష‌న్ల‌కు పెద్ద ఎత్తున డైరెక్ట‌ర్ల‌ను నియ‌మిస్తూ.. జంబో కార్పొరేష‌న్లుగా మారుస్తున్నారు. ఒక‌ర‌కంగా చూస్తే.. కార్పొరేష‌న్లో సిబ్బంది కంటే కూడా.. డైరెక్ట‌ర్ల సంఖ్యే ఎక్కువ‌గా ఉంటోంది. రాష్ట్రంలో ఒక్కొక్క సామాజిక వ‌ర్గానికి ఒక్కొక్క కార్పొరేష‌న్ ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.

ఈ క్ర‌మంలో కార్పొరేష‌న్ల‌కు ఒక్కొక్క చైర్మ‌న్‌నే నియ‌మించినా.. దీనికి దాదాపు స‌త్స‌మానమైన డైరెక్టర్ల ప‌ద‌వి విష‌యంలో రాజీ ప‌డ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో పెద్ద సంఖ్య‌లో డైరెక్ట‌ర్ల‌ను నియ‌మిస్తూ.. సంతృప్తి ప‌రిచే ప్ర‌క్రియ‌కు సీఎం చంద్ర‌బాబు శ్రీకారం చుట్టిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా నాలుగు కార్పొరేష‌న్ల‌కు ఏకంగా 51 మంది డైరెక్ట‌ర్ల‌ను నియ‌మించారు. నిజానికి ఒక్క కార్పొరేష‌న్‌కు ఒక చైర్మ‌న్‌, ఒక‌ డైరెక్ట‌ర్ ఉంటారు.

కానీ, చిత్రంగా ఒక్కొక్క కార్పొరేష‌న్‌కు 15-20 మంది డైరెక్ట‌ర్ల‌ను నియ‌మించారు. దీంతో ప‌ద‌వులు పొందిన వారు హ్యాపీగా ఫీలవుతున్నా.. కార్పొరేష‌న్ల‌లో వారికి సీట్లు కేటాయించ‌డంతోపాటు అధికారాలు అప్ప‌గించే విష‌యంలో మాత్రం స‌త‌మ‌తం కావ‌డం ఖాయ‌మ‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. గ‌తంలో రెండు మాసాల కింద‌ట‌.. 11 కార్పొరేష‌న్ల‌కు డైరెక్ట‌ర్ల‌ను నియ‌మించారు. అప్పట్లోనూ ఒక్కొక్క కార్పొరేష‌న్‌కు 12 మందిని డైరెక్ట‌ర్లుగా నియ‌మించ‌డం గ‌మ‌నార్హం

తాజాగా ఏం జ‌రిగింది?

ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌కు 16 మంది డైరెక్ట‌ర్లు.

బీసీ సహకార సంఘానికి ఐదుగురు డైరెక్ట‌ర్లు.

కమ్మ కార్పొరేషన్‌కు 15 మందిని నియ‌మించారు.

రాష్ట్ర నూర్‌బాషా దూదేకుల కార్పొరేషన్‌కు 15 మంది డైరెక్టర్లను నియమించారు.

కొస‌మెరుపు: మ‌రి ఇంత మంది డైరెక్ట‌ర్లు ఏం చేస్తారో? వారికి అప్ప‌గించే ప‌నులు ఏంటో? వారికి కేటాయించే కార్యాల‌యాలు ఎక్క‌డో? అనేది మాత్రం స‌ర్కారు చెప్ప‌లేదు. మొత్తంగా ప‌దవులు ఇచ్చాం.. అంటే.. ఇచ్చేశాం! అన్న‌ట్టుగా స‌ర్కారు వ్య‌వ‌హ‌రిం చింద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.