సృష్టి” కేసులో తీగ లాగితే డొంక కదులుతుంది!

..భారత్ న్యూస్ హైదరాబాద్….సృష్టి” కేసులో తీగ లాగితే డొంక కదులుతుంది!

సికింద్రాబాద్ సృష్టి,ఫెర్టిలిటీ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తుంది, ఇప్పటికే ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య 24 కు చేరింది, పోలీసులు దర్యా ప్తును మరింత ముమ్మరం చేశారు విచారణలో భాగంగా అక్రమాల సృష్టికి కారకురాలైన ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత నుంచి తాజాగా కీలక విషయాలు రాబట్టారు.

వైద్య వర్గాల్లో ‘సృష్టి’ ఫెర్టిలిటీ కేసు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు వేగం పెంచింది. తాజాగా ఈ కేసులో విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్‌ కేజీహెచ్,కు చెందిన ఇద్దరు వైద్యులను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు.

అరెస్ట్ అయిన వారిలో మత్తు వైద్య విభాగాధిపతి డాక్టర్ వాసుపల్లి రవి కుమార్, ప్రసూతి విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉషాదేవి ఉన్నారు. ఇక వాసుపల్లి రవి కుమార్ మాజీ ఎమ్మెల్యే తమ్ముడు కావడంతో ఈ కేసులో మరో రాజకీయ కోణాన్ని తీసుక రాబోతుంది.

ఇదివరకు ఇదే కేసులో అరెస్టయి, బెయిల్ పై విడుదలైన డాక్టర్ విద్యుల్లత కూడా కేజీహెచ్ పిల్లల విభాగంలో పనిచేశారు. ఈ వైద్యులు కేజీహెచ్‌లో విధులు నిర్వహిస్తూనే ‘సృష్టి’ ఫెర్టిలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేవారని ఆరోపణలు ఉన్నాయి.

కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ఈ అరెస్టులపై తనకు వివరాలు తెలియవని తెలిపారు. డాక్టర్ వాసుపల్లి రవి కుమార్ గత మూడు రోజులుగా సెలవులో ఉన్నట్లు సమాచారం.ఇక మరో వైపు, ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో సంబంధాలు కలిగి ఉన్న ఇద్దరు వైద్యులు డాక్టర్ రమ్య, డాక్టర్ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దీంతో ఇప్పటివరకు ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 28కి చేరింది. దర్యాప్తులో బయటపడ్డ వివరాల ప్రకారం, సరోగసి పేరుతో డాక్టర్ నమ్రత ఇప్పటి వరకు సుమారు 50 మంది బాధితుల వద్ద నుంచి రూ.20 కోట్లకు పైగా వసూలు చేశారు. మరో కీలక నిందితురాలు సంతోషి ఏజెంట్ల ద్వారా 18 మంది శిశువులను సేకరించినట్లు తేలింది.

ముఖ్యంగా గిరిజన మహిళలను ప్రలోభపెట్టి వారి నుంచి శిశువులను రూ.5 లక్షలకు కొనుగోలు చేసి, తమ క్లయింట్లకు ఒక్కో శిశువును రూ.50 లక్షలకు విక్రయించినట్లు వెల్లడైంది. మొత్తం 80 మంది పిల్లలను అమ్మిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు డాక్టర్ నమ్రత బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు. తల్లులను గుర్తించి శిశువులను తిరిగి వారికి అప్పగించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.