వాడపల్లి వచ్చే భక్తులు పెరుగుతున్నారు

భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…వాడపల్లి వచ్చే భక్తులు పెరుగుతున్నారు

పోలీసు బందోబస్తు సరిపోవడం లేదు

ప్రతి శనివారం వచ్చే భక్తుల సంఖ్య 80 వేలు

బందోబస్తు చేస్తున్న పోలీసులు 50

దేవస్థానం సెక్యూరిటీ 50 మంది

వాడపల్లి విశిష్టత-6

 కోనసీమ తిరుమలగా ప్రసిద్ధికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులు సంఖ్య వారం వారం పెరుగుతూ వస్తుంది.అయితే అందుకు తగినంత పోలీసు బందోబస్తు లేకపోవడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. "ఏడు వారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం" నమ్మకంతో తెలుగు రాష్ట్రాల నుంచేగాక దేశవ్యాప్తంగా అనేకమంది భక్తులు ఈ ఆలయానికి తరలివస్తున్నారు. దీంతో వారందరికీ తగిన భద్రత కల్పించడంతోపాటు ప్రధానంగా ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి పోలీసులు అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది.వాడపల్లి అనే చిన్న పల్లెటూరిలో వెలసిన ఈ స్వామివారి దర్శనానికి బస్సులు, కార్లు, ఆటోలు,మోటార్ సైకిల్ వంటి వాహనాల ద్వారా తరలివస్తున్నారు. అయితే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంటే అందుకు అనుగుణంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం లేదు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ఆ వెంకటేశ్వర స్వామి వారిపైనే భారం మోపి ఉన్నంతలోనే పోలీసులు డ్యూటీలు చేస్తున్నారు.

80 వేల మందికి 50 మంది పోలీసులు

ప్రతి శనివారం వాడపల్లికి సుమారు 80 వేల మంది భక్తులు వస్తున్నట్లు అంచనా.అయితే వారందరికీ తగిన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండటానికి సుమారు 150 మంది పోలీసులు అవసరం ఉంటుంది.కానీ ప్రస్తుతం 50 మంది మాత్రమే ఉండడంవల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక్కొక్క సందర్భంలో ట్రాఫిక్ స్తంభించబోతుంది. దాన్ని క్లియర్ చేయడానికి రెండు మూడు గంటలు కూడా పడుతుంది.పోలీసులు అధికంగా ట్రాఫిక్ పై దృష్టి పెడుతుంటే ఆలయం వద్ద క్యూ లైన్లు, ప్రదక్షణలు చేసే మాడ వీధులు వద్ద, అన్నదానం ప్రదేశాల్లోనూ ఇబ్బందికరంగా మారుతుంది. అలాగని ఇక్కడ సర్దుబాటు చేస్తే అక్కడ ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. దేవస్థానం వారు సుమారు 50 మందిని సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అయితే వారు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరణ లోను వారి సామర్థ్యం సరిపోదు.. పోలీసులు కు భయపడినట్లుగా ఈ సెక్యూరిటీకి ని లెక్క చేయడం లేదు.

విఐపి ల రాకతో ప్రోటోకాల్ సమస్య

వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి రోజురోజుకు ఆదరణ పెరుగుతున్నడంతో వీఐపీల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు అనేకమంది సినీ నటులు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఉన్నతాధికారులు తరలి వస్తున్నారు. వారిలో కొందరికి ప్రోటోకాల్ ప్రకారం పోలీసుల అవసరం ఉంటుంది. స్వామివారి దర్శనానికి వచ్చే విఐపిలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శన భాగ్యం కల్పించాల్సి ఉంటుంది. అలాగే వీరు వాహనాలను కూడా ట్రాఫిక్కు సమస్య లేని ప్రాంతం నుంచి పంపించాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ చూసుకోవాలంటే పోలీసుల సంఖ్య ప్రస్తుతం ఉన్న దానికి రెండు రెట్లు అవసరం ఉంటుంది. ప్రస్తుతం కొత్తపేట డిఎస్పి సుంకర మురళీమోహన్ పర్యవేక్షణలో రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఈ బందోబస్తు జరుగుతుంది. రావులపాలెం, రాజోలు సర్కిల్స్ పరిధిలో ఉన్న ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు, రాజోలు, పి గన్నవరం పోలీసు స్టేషన్లు కు సంబంధించిన పోలీసులు ప్రతి శనివారం ఇక్కడ డ్యూటీ నిర్వహిస్తున్నారు. ఇందులో ఐదుగురు ఎస్ఐ లు ఉండగా ఎఎస్ఐ,హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ 50 మంది వరకు ఉంటున్నారు.వాడపల్లిలో పోలీసు అవుట్ పోస్ట్ ఉంది.

ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు
డిఎస్పీ మురళీమోహన్

వాడపల్లికి ప్రతి శనివారం వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్నందున బందోబస్తుకు పోలీసుల సంఖ్య పెరగాల్సి ఉందని దీనిపై ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారని కొత్తపేట డిఎస్పి సుంకర మురళీమోహన్ తెలిపారు. ఇప్పటికే కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఉన్నతాధికారులకు ఇక్కడ పరిస్థితిని వివరించారన్నారు. దేవస్థానం వారు కూడా ప్రవేటు సెక్యూరిటీ సంఖ్య మరింత పెంచుకోవాల్సి ఉందన్నారు. అలాగే వాలంటీర్ల సేవలను కూడా ప్రతి శనివారం వినియోగించడానికి సమీక్ష జరుపుతున్నామన్నారు.అయితే వాడపల్లి వచ్చే వాహనదారులు పోలీసులకు సహకరించి వాహనాలను రోడ్డు పక్కన పార్క్ చేయకుండా దేవస్థానం వారి ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాల్లోనే పార్క్ చేయాలని డి.ఎస్.పి మురళీమోహన్ సూచించారు.