తెలంగాణ రాష్ట్రంలో 2.5 కోట్ల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు

..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ రాష్ట్రంలో 2.5 కోట్ల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు

  • ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ జారీలో వేగం పెంచిన ప్రభుత్వం
  • ఇప్పటికే 68 లక్షల మంది హెల్త్ రికార్డులు డిజిటలైజేషన్
  • పాత రిపోర్టులు డిజిటల్ గా చూసుకునే వెసులుబాటు
  • 36 లక్షల అకౌంట్స్​తో హైదరాబాద్ జిల్లా టాప్

రాష్ట్రంలో డిజిటల్ హెల్త్ కార్డుల జారీ వేగంగా కొనసాగుతున్నది. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్(అభా) ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో 2.50 కోట్ల మంది డిజిటల్ హెల్త్ కార్డులు పొందారు. వీరిలో 68 లక్షల మంది తమ హెల్త్ రిపోర్టులను అభాతో అనుసంధానం చేసుకున్నారు. ఒక్క జులై నెలలోనే 2.36 లక్షల మంది తమ హెల్త్ రికార్డులను డిజిటల్‌గా లింక్ చేసుకోవడం విశేషం.

హెల్త్ రికార్డులను డిజిటలైజ్ చేసి మెరుగైన ఆరోగ్య సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ను ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద తీసుకొచ్చింది. మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆసుపత్రుల్లో ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ పేషెంట్లకు అభా ఐడీ తప్పనిసరి చేయాలని ఆరోగ్య శాఖ అధికారులకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఇటీవలే ఆదేశించింది.

14 అంకెల యూనిక్ ఐడీతో.. హెల్త్ రికార్డులు

ఆధార్ నంబర్, డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా అభా కార్డును పొందొచ్చు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది అభా ఐడీని జనరేట్ చేసి ఇస్తారు. లేదంటే పేషెంట్లే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అధికారిక వెబ్‍సైట్‍ abdm.gov.in లోకి వెళ్లి కార్డ్ పొందొచ్చు. అభా కార్డుకు 14 అంకెల యూనిక్​నంబర్ కేటాయించబడుతుంది. ఈ నంబర్‌తో ఆరోగ్య సమస్యలు, ల్యాబ్ రిపోర్టులు, మందుల వివరాలు వంటి మెడికల్ రికార్డులను డిజిటల్‌గా నమోదు చేయవచ్చు. పేషెంట్ హెల్త్ హిస్టరీ మొత్తం ఈ అభా అకౌంట్ లో నిక్షిప్తమై ఉంటుంది.

ఒకసారి అకౌంట్ ఓపెన్ చేస్తే, పేషెంట్ ఏ ఆసుపత్రికి వెళ్లారు, గతంలో ఎక్కడ చికిత్స తీసుకున్నారు, ఏ మందులు వాడారు, ఏ పరీక్షలు చేయించుకున్నారు వంటి వివరాలు ఈ అకౌంట్ లో నమోదవుతాయి. దీనివల్ల డాక్టర్లు పేషెంట్ సమస్యను త్వరగా అర్థం చేసుకొని చికిత్స అందించడం సులభమవుతుంది.

క్యూలైన్ ఇబ్బందులు లేకుండా

అభా కార్డ్ ద్వారా పేషెంట్లకు మరో వెలుసుబాటు కూడా ఉంది. అభా అకౌంట్ ఉంటే ఓపీ రిజిస్ట్రేషన్ కోసం క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. అభా యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని, ఆసుపత్రిలోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే టోకెన్ పొందవచ్చు. ఇంటి నుంచే టోకెన్ జనరేట్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. గతంలో ఓపీ రిజిస్ట్రేషన్‌కు గంటల సమయం పట్టేది. కానీ ఇప్పుడు టోకెన్ నంబర్ చెబితే క్షణాల్లో ఓపీ స్లిప్ అందుతుంది. దీనివల్ల రోగులు క్యూలో వేచి ఉండకుండా నేరుగా డాక్టర్ వద్దకు వెళ్లవచ్చు. స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు ఈ యాప్ ద్వారా సేవలు పొందితే సిబ్బందిపై భారం కూడా తగ్గుతుంది…