మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ను కలిసిన వైసీపీ నేతలు

భారత్ న్యూస్ అనంతపురం .. …మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ను కలిసిన వైసీపీ నేతలు

అనంతపురం పర్యటనకు వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజను నగరంలోని సాయిబాబా నేషనల్‌ డిగ్రీ కళాశాలలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇటీవల సామూహిక అత్యాచారానికి గురైన దళిత బాలిక, హత్యకు గురైన గిరిజన విద్యార్థిని కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా దళితులు, గిరిజన మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయన్నారు. దళిత, గిరిజన మహిళలపై దాడులు అధికమయ్యాయని తెలిపారు. నగరంలోని రామకృష్ణ కాలనీకి చెందిన గిరిజన విద్యార్థిని తన్మయిని అత్యంత కిరాతకంగా హత్య చేశారని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో 9వ తరగతి చదువుతున్న దళిత మైనర్‌ బాలికపై అదే గ్రామానికి చెందిన వారు సామూహిక లైంగిక దాడి చేశారని, ఇటీవల సదరు బాలిక మగబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు. ఈ ఘటనలను గతంలోనే జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ శైలజ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని కోరారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ద్వారా విచారణ చేసి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరారు. అదేవిధంగా బాధిత కుటుంబాలకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల మేరకు అందాల్సిన ఎక్స్‌గ్రేషియా అందించాలని తెలిపారు. హత్యకు గురైన తన్మయి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, వ్యవసాయ భూమి మంజూరు చేసి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. స్పందించిన రాయపాటి శైలజ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే చిరంజీవి, ఎస్టీ సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు సాకే శ్రీనివాసులు, ఎస్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు నాయక్, మహిళా విభాగం అనంతపురం నగర అధ్యక్షురాలు సాకే చంద్రలేఖ, ఎస్టీ సెల్‌ నగర కార్యదర్శి మణికంఠ, ఎస్సీ సెల్‌ నేత సంఘమేష్, మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి అంజలి, పంచాయతీరాజ్‌ ప్రధాన కార్యదర్శి హాజర, మహిళా నాయకురాలు తలారి ఉష, రాధా యాదవ్, భారతి, లీలా తదితరులు పాల్గొన్నారు..