తెలంగాణ రాష్ట్ర గవర్నరును కలిసిన బుద్ధప్రసాద్

భారత్ న్యూస్ రాజమండ్రి….తెలంగాణ రాష్ట్ర గవర్నరును కలిసిన బుద్ధప్రసాద్

మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కార ప్రదానోత్సవ సభకు ఆహ్వానం

అవనిగడ్డ:
హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి వెలుదండ నిత్యానందరావు కలిసి మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కార ప్రదానోత్సవ సభకు ఆహ్వానించారు.

ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహకులు స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఆగస్టు 4వ తేదీ నుంచి ప్రారంభమై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏడాది పాటు ఘనంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాదులోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ఆగస్ట్ 13వ తేదీన మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కార ప్రదానోత్సవ సభ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఈ సభకు ఆహ్వానించారు. మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు గవర్నరుకు తెలిపారు.

మండలి వెంకట కృష్ణారావు అంతర్జాతీయ తెలుగు కేంద్రం పక్షాన అజో విభో విష్ణుభోట్ల కందాళం ఫౌండేషన్ వ్యవస్థాపకులు అప్పాజోస్యుల సత్యనారాయణకు, మహారాష్ట్రలోని షోలాపూర్ తెలుగు భాషాభివృద్ధి సార్వజనిక గ్రంథాలయం వారికి మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారాలు అందించనున్నట్లు వివరించారు. వారి ఆహ్వానం మేరకు సభకు విచ్చేసేందుకు గవర్నర్ అంగీకారం తెలిపారు.