భారత్ న్యూస్ విశాఖపట్నం..జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన సోము వీర్రాజు
అధికారుల అంతు చూస్తామని జగన్ బెదిరిస్తున్నారన్న వీర్రాజు
వైసీపీ నేతలు జైళ్లకు ఎందుకు వెళుతున్నారో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు
2029లో కూడా కూటమే అధికారంలోకి వస్తుందని ధీమా
వైసీపీ అధినేత జగన్ పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడే విధానాన్ని జగన్ మార్చుకోవాలని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని… అధికారుల అంతు చూస్తామని జగన్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు జైళ్లకు వెళుతున్నారని చెప్పారు.
వైసీపీ హయాంలో రూ. 420కి నెయ్యి కొని తిరుమలలో లడ్డూలు తయారు చేశారని విమర్శించారు. మళ్లీ అధికారంలోకి వస్తే రూ. 320కి కొంటారా? అని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు ఎందుకు జైళ్లకు వెళుతున్నారో జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. లోకేశ్ చేసిన యువగళం పాదయాత్రలో వైసీపీ నేతలు ఏం చేశారో రికార్డులను వెనక్కి తీయిస్తే వారి అరాచకాలు బయటపడతాయని చెప్పారు.
ప్రభుత్వాన్ని బెదిరించినంత మాత్రాన ప్రజలు మిమ్మల్ని నమ్మరని… మీరు మళ్లీ అధికారంలోకి రావడం కలేనని వీర్రాజు అన్నారు. 2029లో కూడా కూటమే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. వైసీపీ పాలనలో రోడ్డుపై ఒక్క గొయ్యి కూడా పూడ్చలేదని విమర్శించారు.
గతంలో తనను గుడివాడకు వెళ్లకుండా అడ్డుకున్నారని చెప్పారు. తాను రామతీర్థం నుంచి కపిలతీర్థం వెళ్లడానికి కూడా జగన్ ప్రభుత్వం అనుమతించలేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీపై ఉన్నంత గౌరవం తెలంగాణపై కూడా ఉందని చెప్పారు. ఏపీలోని అన్ని పార్టీలు బనకచర్లకు అనుకూలంగా మాట్లాడాలని కోరారు.
