భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…పిఠాపురంలో వైసీపీ ఉన్నట్టా.. లేనట్టా… ?
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రత్యర్థి పక్షం అంటూ లేకుండా పోయిందా? ముఖ్యంగా వైసీపీ తరఫున వాయిస్ వినిపించడం లేదా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. గతంలో వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న పెండెం దొరబాబు.. నేరుగా జనసేనలోనే చేరిపోయారు. ఇది వైసీపీని ఏమీ చేయదని మొదట్లో అనుకున్నా.. ఆయన వర్గం, ఆయన అనుచరులు ఇప్పుడు గుండుగుత్తగా.. జనసేన వైపే ఉన్నారు.
ఇక, వైసీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన.. వంగా గీత కూడా ఇప్పుడు పిఠాపురానికి కడు దూరంలో ఉన్నారు. ఆమె ఎక్కడా నియజకవర్గంలో కనిపించడం లేదు. ఇటీవల వైసీపీ అధినేత జగన్.. బాబు మేనిఫెస్టోపై కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికీ వెళ్లాలని.. చంద్రబాబు మాట తప్పారన్న విషయాన్ని పూసగుచ్చినట్టు వివరించాలని నాయకులకు తేల్చి చెప్పారు. కానీ, చిత్రం ఏంటంటే.. ఇది కూడారాష్ట్రంలో పెద్దగా వర్కవుట్ కాలేదు. ముఖ్యంగా పిఠాపురంలో అసలు లేదనే చెప్పాలి.
తొలి రెండు రోజులు వంగా గీత కొంత ప్రయత్నం చేశారు. బాబు మేనిఫెస్టో పై కార్యక్రమం నిర్వహించేందుకు నాయకులను, అనుచరులను సమాయత్తం చేసే ప్రయత్నం చేశారు. కానీ, ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పైగా.. వంద మంది కూడా.. ఆమె పెట్టిన సమావేశానికి రాలేదు. దీంతో ఆమె.. తన ఇంటికే పరిమితం అయ్యారు. అంతేకాదు.. తొలి ఆరు మాసాల్లో కొంత మేరకు.. వాయిస్ వినిపించినా.. తర్వాత.. గీత విమర్శల జోలికి కూడా పోలేదు. పిఠాపురంలో రెండు మూడు ఘటనలు జరిగినా.. ఆమె స్పందించలేదు.

దీనికి కూడా కారణం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. వంగా గీత ఇప్పుడు అభద్రతా భావంతో ఉ న్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. టీడీపీ నాయకుడు వర్మ అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో ఆ యనకు వైసీపీ వల విసురుతోంది. ఆయనకు భారీ ఎత్తున మీడియాలోకవరేజీ ఇస్తోంది. సో.. రేపు ఆయన మనసు మార్చుకుని వైసీపీలోకి వస్తే.. పిఠాపురం టికెట్ ఆయన ఖాతాలోకి వెళ్తుంది. అలాంటప్పుడు.. తాను నియోజకవర్గంలో పర్యటించి.. పవన్‌పై విమర్శలు చేయడం ఎందుకు? అనే ధోరణిలో గీత ఉన్నారని ఒకటాక్. ఇలా.. ఏవిధంగా చూసినా.. పిఠాపురంలో వైసీపీ ఇప్పటికైతే.. లేదనే అంటున్నారు పరిశీలకులు.