అభివృద్ధిలో కృష్ణా జిల్లాను మోడల్ జిల్లాగా మలుస్తాం

భారత్ న్యూస్ విజయవాడ…అభివృద్ధిలో కృష్ణా జిల్లాను మోడల్ జిల్లాగా మలుస్తాం

— ల్యాండ్, శాండ్, వైన్, మైన్ కుంభకోణాలతో జగన్ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాడు

— తమ కుంభకోణాల నుండి దృష్టి మరల్చేందుకు కులమత రాజకీయాలు

— కృష్ణా జిల్లా ప్రతిష్టను గత పాలకులు నాశనం చేశారు

— కూటమి ఎమ్మెల్యేలంతా చర్చించుకుని అభివృద్ధి ప్రణాళికలు రచిస్తున్నాం

— పి4, విజన్ 2047 విజయాలకు కేంద్రంగా కృష్ణా జిల్లాను మారుస్తామన్న మంత్రి కొల్లు రవీంద్ర

అవనిగడ్డ – జులై 7 (మనం న్యూస్): పేదరిక నిర్మూలనతో పాటుగా అభివృద్ధిలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో గడిచిన ఐదు సంవత్సరాలు ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి కూడా భయపడే పరిస్థితులు కల్పించారని అన్నారు. సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. పొరపాటున సోషల్ మీడియాలో గానీ, పత్రికా సమావేశాల్లో గానీ ప్రజా సమస్యలు లేవనెత్తిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులు, దాడులతో భయబ్రాంతులకు గురి చేసారని అన్నారు.

కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజలకు జవాబుదారీగా నిలుస్తోందని, ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం కోసమే ‘సుపరిపాలనలో తొలి ఏడాది’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం సంక్షేమం, అభివృద్ధితో పాలన మొత్తాన్ని గాడిన పెట్టామని, ఆర్ధిక విధ్వంసం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామని, గుంతలు లేని రోడ్లు సాకారం చేసే లక్ష్యంతో రాష్ట్రంలో సుమారు 40 వేల కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టామని అన్నారు.

పెన్షన్, అన్న క్యాంటీన్లు, తల్లికి వందనం పథకాలు ఇప్పటికే అమలు చేశామని, ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే రైతులకు డబ్బులు చెల్లిస్తున్నామని అన్నారు. పెట్టుబడుల ఆకర్షణ ద్వారా ఆర్ధిక అభివృద్ధితో పాటుగా.. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యాన్ని సాధించే దిశగా కూటమి ప్రభుత్వం నడుస్తుందన్నారు. జగన్ రెడ్డి తరిమేసిన పరిశ్రమల్ని తిరిగి రాష్ట్రానికి రప్పించామని, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని, జీవో నెం. 217ను రద్దు చేశామని అన్నారు.

జగన్ రెడ్డి పాలనంతా దోపిడీలతో నిండిపోయిందని, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ దోపిడీలతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిక్కర్ స్కాం జగన్ రెడ్డి అండతో జరిగిందని, దాన్నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ పేరిట డ్రామాలాడుతున్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో కుట్ర రాజకీయాలకు తెరలేపారన్నారు.

పల్నాడులో పరామర్శ పేరుతో సింగయ్య అనే దళితుడిని కారు కింద తొక్కి చంపి, పరామర్శ పేరుతో వారి కుటుంబాన్ని బెదిరించారని, అంతకు ముందు పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని, రప్పా రప్పా నరుకుతాం అనే వారిని ప్రోత్సహిస్తున్నారు. జగన్ రెడ్డి లాంటి అరాచక శక్తులకు ప్రజాస్వామ్య దేశంలో ఉండే అర్హత లేదని హెచ్చరించారు.

కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, జోగి రమేశ్ అనే కొందరు అరాచక శక్తులు కృష్ణా జిల్లా ప్రతిష్టను మసకబారేలా చేశారన్నారు. దాడులు, బూతులు, దోపిడీలతో జిల్లాను అరాచక శక్తులకు అడ్డాగా మార్చారన్నారు. కానీ ప్రస్తుతం జిల్లాలోని ఎమ్మెల్యేలంతా చర్చించుకుని ప్రతి నియోజకవర్గాన్ని యూనిట్ గా అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నాం. పి4 ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామన్నారు. విజన్ 2047 ప్రకారం జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు కలిసి పని చేస్తున్నామన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సుమారు 80 వేల బంగారు కుటుంబాలను గుర్తించామని, పెట్టుబడి పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయని అన్నారు. ప్రజలు ప్రభుత్వం కలిసి ముందుకు వెళ్తే సాధించలేనిది ఏమీ లేదని కూటమి ప్రభుత్వం చూపించబోతోందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, టీడీపీ కృష్ణాజిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మాచవరవు ఆదినారాయణ, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నాయకులు బోబ్బా గోవర్ధన్, అవనిగడ్డ మండల ప్రధాన కార్యదర్శి కర్రా సుధాకర్, కోడూరు మండల అధ్యక్షులు బండే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు