కేరళ డీజీపీ గా రావాడ చంద్రశేఖర్!

భారత్ న్యూస్ విశాఖపట్నం..కేరళ డీజీపీ గా రావాడ చంద్రశేఖర్!
స్వస్థలం వీరవాసరంలో ఆనందోత్సాహాలు

కేరళ రాష్ట్ర పోలీస్ బాస్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం కు చెందిన రావాడ ఆజాద్ చంద్రశేఖర్ నియమితులయ్యారు. కేరళ నూతన డీజీపీ గా చంద్రశేఖర్ ను నియమిస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలియడంతో చంద్రశేఖర్ స్వగ్రామం వీరవాసరంలో ఆయన బంధుమిత్రులు ఆనందోత్సాహలు వ్యక్తం చేస్తున్నారు. 1991 లో ఐ.పీ.ఎస్ కు ఎంపికైన చంద్రశేఖర్ కేరళ క్యాడర్ లో ఉద్యోగబాధ్యతలు స్వీకరించారు. కేరళలో పోలీస్ ఉన్నతాధికారిగా పలు కీలక బాధ్యతల్లో సమర్థవంతంగా వ్యవహరించి భారత రాష్ట్రపతి నుంచి ఉత్తమ సేవల అవార్డును అందుకున్నారు. అక్కడ నుంచి డిప్యుటేషన్ పై కేంద్ర సర్వీసుల్లోకి వెళ్ళారు. సెంట్రల్ ఇంటిలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరక్టర్ హోదాలో పనిచేస్తున్న చంద్రశేఖర్ ను ఇటీవలే సెంట్రల్ కేబినెట్ సెక్రటెరియేట్ (స్పెషల్ సెక్యూరిటీ) కార్యదర్శిగా కేంద్రప్రభుత్వం నియమించింది. ఇంకా ఆ బాధ్యతల్లో చేరకనే… కేరళ ప్రభుత్వం చంద్రశేఖర్ కు డీజీపీ గా ప్రకటించింది. కేరళ రాష్ట్ర డీజీపీ ధర్వేష్ సాహెబ్ ఈరోజు పదవీవిరమణ చేస్తుండటంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వం నూతన డీజీపీ గా చంద్రశేఖర్ ను నియమించింది. ఒక రాష్ట్రానికి పోలీస్ బాస్ గా మనూరి రావాడ వారు అత్యున్నత పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న తీపి కబురు తెలీడంతో వీరవాసరంలోని చంద్రశేఖర్ బంధుమిత్రులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై చంద్రశేఖర్ కు ఆత్మీయుడైన జీ.వీ.వీ.ప్రసాద్ మాట్లాడుతూ, ఇష్టపడి చదువుకుని కష్టపడే తత్త్వం వున్నా ప్రతీ ఒక్కరూ మహోన్నత వ్యక్తిత్వం గల చంద్రశేఖర్ లా ఉన్నతశిఖరాలను అధిరోహించవచ్చని ఆశాబావాన్ని వ్యక్తంచేశారు.