భారత్ న్యూస్ రాజమండ్రి….మహా న్యూస్ పై టిఆర్ఎస్ దాడి నీచం – హేయం
అమరావతి బహుజన ఐకాస బాలకోటయ్య
హైదరాబాద్ లోని మహా న్యూస్ చానెల్ ప్రధాన కార్యాలయంపై టిఆర్ఎస్ పార్టీ గుండాలు చేసిన దాడి నీచం, హేయం అని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఫోన్ టాపింగ్ వివాదంపై మీడియా కథనాలకే ఉలిక్కి పడే టిఆర్ఎస్ పార్టీ రాజకీయ కురుక్షేత్రంలో ఏం పోరాడుతోందని ప్రశ్నించారు. అధికారం పోయిందన్న ఆవేశంలో మీడియాపై దాడి చేయటం పిరికితనం మాత్రమే అన్నారు. రాను రాను రాజకీయ పార్టీల కారణంగా మీడియా చానల్స్ కు, జర్నలిస్టులకు భధ్రత లేదన్నారు. మహా న్యూస్ ఎండీ కి భద్రత ఇవ్వాలని తెలిపారు. ఇలాంటి హిడింబి చర్యలు కారణంగా భవిష్యత్తులో ఎవ్వరూ జర్నలిస్టులుగా పని చేయలేరని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహా న్యూస్ కు భద్రత కల్పించి, దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్టు చేయాలని, తద్వారా మీడియా వ్యవస్థకు భరోసా ఇవ్వాలని బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు.
