మద్రాస్ ఫిల్టర్ కాఫీ యజమాని యశ్వంత్ కుమార్ పై కేసు నమోదు

భారత్ న్యూస్ కడప ….మద్రాస్ ఫిల్టర్ కాఫీ యజమాని యశ్వంత్ కుమార్ పై కేసు నమోదు

నకిలీ పత్రాల ద్వారా 1979 నుండి మద్రాస్ ఫిల్టర్ కాఫీ వ్యాపారంలో ఉన్నామంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులను, కోర్టు లను బురిడీ కొట్టించి ట్రేడ్ మార్క్ లైసెన్స్ తెచ్చుకొని ప్రజల్ని మోసం చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన బడా మోసం.

ఈ విషయమై పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు పోలీసు స్టేషన్ లో ఇతని మీద చీటింగ్ మరియు ఫోర్జరీ కేసు నమోదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 318(4), 336(3) BNS 2023, 0/W 3(5) 2 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో బృందాలుగా ఏర్పడి విచారణ సాగించారు. తగు ఆధారాలు సేకరించి ఫోర్జరీ జరిగింది అని ప్రాధమికంగా ధ్రువీకరించి నిందితుడిని మరిన్ని వివరాల కోసం విచారణ చేయాలని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా నిందితుడు పరుచూరి యశ్వంత్ కుమార్ పై గతంలో కూడా రాష్ట్రంలోని పలు స్టేషన్లలో కేసులు నమోదు అయి ఉన్నాయి.

విజయవాడ సింగ్ నగర్ పోలిస్ స్టేషన్ లో డబ్బులు కోసం బెదిరింపు, చీటింగ్ కేస్ 29/2025 316 (2), 351(2), 0/w 3(5) సెక్షన్ల కింద ఇతని అనుచరులతో సహా కేసులు నమోదు అయ్యాయి.

అలాగే ఫోటోలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాలలో (సోషల్ మీడియాలో) తోటి వ్యాపారులను బెదిరించిన నేరంపై 351(2), 0/1 3(5) BNS 66-C ITA – 2000 సెక్షన్ల కింద విశాఖ సైబర్ క్రైం పోలీసులు కూడా కేసు నమోదు చేసి ఉన్నారు. ప్రస్తుతం ఆ కేసులు కూడా పోలీసు వారి విచారణలో ఉన్నాయి.

వాస్తవానికి మద్రాస్ ఫిల్టర్ కాఫీ అనే బ్రాండ్ అసలు వ్యవస్థాపకులు వేరే ఉండగా కుట్రతో, అనైతికంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి 1979 నుండే ఈ బ్రాండ్ తన స్వంతమని చెప్పుకుంటూ ఫ్రాంచైజీలు అమ్ముకోవడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు గడించి సాటి వ్యాపారస్తులను ముంచేశాడు.
తాజాగా ఈ ఫోర్జరీ భాగోతం వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇతని బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ జరపాలని పోలీసు అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.