అధికారులు సమన్వయంతో అభివృద్ధికి సహకరించాలి: సింగల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి
పాకాల ( భారత్ న్యూస్ )పాకాల మండలంలోని పంచాయితీలలో తాగునీటి సమస్య, విద్యుత్ సమస్య, వీధిలైట్లు, డ్రైనేజీ లాంటి అన్ని సమస్యలను త్వరితగరిచిన సమన్వయంతో పరిష్కరించాలని మండల సింగల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి సూచించారు. శుక్రవారం పాకాల మండల కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే పులివర్తి నాని ఆశయం మేరకు మండలాన్ని అభివృద్ధి పథంలో నిలపడానికి అధికారులంతా కృషి చేయాలని కోరారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు.అత్యవసర పరిస్థితి అయితే తప్ప ప్రజలు బయట తిరగరాదని ప్రజలకు అవగాహన కలిగించాలని తగు సూచనలు చేయాలని ఎంపీడీఓ వాసుదేవరావు అధికారులను కోరారు.వ్యవసాయానికి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.అర్హత కలిగిన రైతులకు గోకులాలను వెటర్నరీ సిబ్బంది మంజూరు చేసి,ఫీల్డ్ అసిస్టెంట్లు షెడ్ ఏర్పాటు చేయాలని సూచించారు.పాకాల జడ్పిటిసి నంగా పద్మజా బాబు రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ నీటి సరఫరా విభాగాలు,పంచాయతీ కార్యదర్శులతో బృందాలు ఏర్పాటు చేసి,పైప్లైన్ లీకేజీలను అరికట్టడం,అడుగంటిన బోర్లను బాగు చేయడం మరియు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను పర్యవేక్షించడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు.ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని,అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయట తిరగరాదని,ఎక్కువగా త్రాగునీరు,పండ్ల రసాలు సేవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లోకనాథం, తహసిల్దార్ సంతోష్ సాయి, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
