భారత్ న్యూస్ డిజిటల్:అమరావతి:
ప్రకాశం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
జాతీయ జెండాకు గౌరవ వందనం చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు ఐఏయస్ గారు, ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారు, జిల్లా అధికారులు మరియు ప్రజలు
ఆకట్టుకున్న పోలీసు పెరేడ్, శకటాల ప్రదర్శన… దేశభక్తితో ఉప్పొంగిన సాంస్కృతిక కార్యక్రమాలు
అబ్బురపరిచిన పోలీస్ స్వాట్ టీమ్, అగ్ని మాపక టీమ్ సాహసాలు
ఒంగోలులోని స్థానిక పోలీసు పెరేడ్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగినవి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎస్పీ గారు హాజరై పోలీసు దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పోలీసు మైదానంలో జిల్లా కలెక్టర్ గారు జాతీయ జెండాను పతాకావిష్కరణ చేసి, ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తదుపరి ప్రత్యేకంగా అలంకరించిన పెరేడ్ వాహనాన్ని ఎక్కి జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎస్పీ గారు పోలీసు పెరేడ్‌ను పరిశీలించారు. పెరేడ్ కమాండర్‌గా ఆర్ఐ రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో పోలీస్ బలగాలు, హోమ్ గార్డ్స్ మరియు ఎన్‌సీసీ క్యాడెట్లు కలిపి మొత్తం ఆరు ప్లాటూన్లు కవాతు నిర్వహించాయి. జాతీయ సమైక్యతను చాటుతూ, దేశభక్తి ఉప్పొంగేలా వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు మరియు కళా బృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ఎనలేని త్యాగాలు చేసిన స్వాతంత్య్ర సమరయోధులను, భారత రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకున్నారు. 1947 ఆగస్టు 15వ తేదీన మన దేశమునకు స్వాతంత్రం వచ్చినది. తర్వాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు ఎందరో మహనీయులు, మేధావులు కృషి చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించారని, 1950 జనవరి 26వ తేది నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత భారత దేశం సర్వ సత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించిందన్నారు. జిల్లా ప్రజలనుద్దేశించి జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రగతిని నివేదించారు. జిల్లాకు చెందిన స్వతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులను దుశ్శాలువాతో సత్కరించారు.
ప్రకాశం జిల్లా పోలీస్ స్వాట్ టీమ్ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా, ప్రజల ప్రాణాలను కాపాడడంలో తమ నైపుణ్యాలను మాక్ డ్రిల్స్ ద్వారా ప్రదర్శించారు. తీవ్రవాదులు/సంఘవిద్రోహ శక్తులు ముఖ్యమైన ప్రజా ప్రతినిధులు/వీఐపీలను పట్టుకొని ఏదైనా ప్రాంతంలోని గదిలో బంధించినప్పుడు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్ కెమెరాల ద్వారా శత్రువులు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి, అక్కడికి స్వాట్ కమాండోలు చేరుకొని, చాకచక్యంగా శత్రువులను హతమార్చి, ప్రముఖులను ఎలా సురక్షితంగా రక్షిస్తారో డెమో ద్వారా ఎంతో అద్భుతంగా ప్రదర్శించారు.
అగ్ని ప్రమాదం/విపత్కర పరిస్థితుల్లో స్పందించే విధానము, ఎలా రక్షించుకోవాలి అనే విషయాలపై అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. అగ్నిమాపక సిబ్బంది ఆయిల్ ఫైర్ అయినప్పుడు ఎలా ఫోమ్ ద్వారా ఆర్పుతారో, విపత్కర పరిస్థితుల్లో చెట్లు పడిపోయినప్పుడు ఏ పరికరాలతో ఎలా తొలగించాలో, బిల్డింగులు కూలినప్పుడు అందులోని చిక్కుకున్న వారిని ఏ విధంగా రక్షించాలో మరియు ఐరన్ రాడ్లను ఏ విధంగా కట్ చేయాలో మరియు గృహంలో ఎల్పీజీ గ్యాస్ అగ్ని ప్రమాదాల జరిగినప్పుడు ఏ విధంగా నివారించాలో చక్కని డెమో ద్వారా అద్భుతంగా చేశారు.
అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎస్పీ గారు సందర్శించారు. రిపబ్లిక్ డే పెరేడ్‌ను అద్భుతంగా ప్రదర్శించిన ప్లాటూన్ కమాండర్లను జిల్లా కలెక్టర్ గారు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. అలాగే స్వాట్ టీమ్ సిబ్బంది ప్రదర్శించిన సాహసాలను జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా ప్రశంసించి ప్రశంసా పత్రాలను అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలను అద్భుతంగా ప్రదర్శించిన పలు పాఠశాలల విద్యార్థులకు జిల్లా కలెక్టర్ గారు ప్రశంసా పత్రాలను అందజేశారు.
ప్రకాశం జిల్లాలో 2025 సంవత్సరంలో విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 15 మంది పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి డీజీపీ కమెండేషన్ సిల్వర్ డిస్క్ (3), కాంస్య డిస్క్ (12)లతో పాటు ప్రశంసా పత్రాలను హాజరైన వారికి అందజేశారు. అలాగే జిల్లాలో పోలీస్ శాఖ మరియు వివిధ ప్రభుత్వ శాఖలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు మరియు సిబ్బందికి జిల్లా కలెక్టర్ గారు ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ వేడుకలలో, జాయింట్ కలెక్టర్ శ్రీ.ఆర్.గోపాలకృష్ణ, డీ.ఆర్.ఓ .శ్రీ.బి చిన్న ఓబులేసు, కందుకూరు సబ్ కలెక్టర్ హిమ వంశీ, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్, ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, దర్శి డిఎస్పీ బి.లక్ష్మీనారాయణ, డీటీసీ డిఎస్పీ గురునాధ్ బాబు, ఏఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు, పోలీసులు, ప్రజాప్రతినిధులు మరియు పలు శాఖల ఉన్నతాధికారులు, ప్రముఖులు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.
